ప్రణాళికతో పదిలం | - | Sakshi
Sakshi News home page

ప్రణాళికతో పదిలం

Mar 12 2026 9:07 AM | Updated on Mar 12 2026 9:07 AM

మెదక్‌ అర్బన్‌: విద్యార్థుల భవిష్యత్తుకు తొలిమెట్టు పదో తరగతి. ఈనెల 14 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. మెరుగైన ఫలితాలు సాధించేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. కాగా పరీక్షలంటే భయపడకుండా ప్రణాళిక ప్రకారం చదివితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని సబ్జెక్టు ఉపాధ్యాయులు, నిపుణులు చెబుతున్నారు. ముఖ్యమైన ప్రశ్నలు గుర్తించి, చదవడంతో పాటు రివిజన్‌ చేసుకుంటే శతశాతం ఫలితాలు సాధ్యమంటున్నారు. విద్యార్థులకు వారు ఇస్తున్న సలహాలు, సూచనలు వారి మాటల్లోనే..

విద్యార్థులకు నిపుణుల సలహాలు, సూచనలు ● 14 నుంచి టెన్త్‌ క్లాస్‌ పరీక్షలు

లెక్కలు.. చిక్కులు కావు

సోపానాల క్రమంలో సమస్య సాధించాలి. గ్రాఫ్‌ నిర్మాణాలు ప్రాక్టీస్‌ చేయాలి. సాంఖ్యక శాస్త్రం, శ్రేఢులు, క్షేత్రమితి సూత్రాలను ఎక్కువగా ప్రాక్టీస్‌ చేస్తే మంచి మార్కులు సాధించవచ్చు. సాంఖ్యక శాస్త్రం, సమితులు, సంభావ్యత, నిరూపక రేఖ గణితం పాఠ్యాంశాలు సులభంగా ఉంటాయి, కాబట్టి వాటిపై దృష్టి పెట్టాలి.

– కొండల్‌రెడ్డి, మాథ్స్‌ టీచర్‌, కూచన్‌పల్లి

ఫిజిక్స్‌ ఆలోచించి రాయాలి

ఫిజిక్స్‌ నిత్య జీవితంలో ఉపయోగాలు, పట నైపుణ్యం, విద్యా ప్రమాణాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. సమాచార నైపుణ్యంలో.. ప్రశ్నలోనే నైపుణ్యం ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించి రాయాలి. విషయావగాహన ప్రమాణం నుంచి కాన్సెప్ట్‌ ఎంపిక చేసుకొని చదివితే మంచి ఫలితాలు ఉంటాయి. – అశోక్‌, ఫిజిక్స్‌ టీచర్‌, నాగ్సాన్‌పల్లి

ఒత్తిడికి లోను కావొద్దు

దో తరగతి విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు రాయాలి. ఇంటి నుంచి పరీక్ష హాల్‌కు వెళ్లే వరకు చదువుతు ఉండటం సరికాదు. అరగంట ముందు పరీక్ష కేంద్రానికి వెళ్లి ప్రశాంతంగా ఉండాలి. కనీసం 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. రాత్రి పూట తేలికగా జీర్ణమయ్యే ఆహారం, ఉదయం కొద్ది పాటి టిఫిన్‌ తిని పరీక్షకు వెళ్లాలి. వేసవి ఎండలు ముదిరినందున తగినంత నీరు తాగాలి. కొబ్బరి నీరైతే మంచిది. – డాక్టర్‌ భానుచందర్‌, పల్స్‌ ఆస్పత్రి, మెదక్‌

Advertisement
 
Advertisement
Advertisement