జిల్లా అగ్రస్థానంలో నిలవాలి
14 నుంచే పరీక్షలు.. పకడ్బందీ ఏర్పాట్లు
15,337 మంది విద్యార్థులు..82 పరీక్షా కేంద్రాలు
అందుబాటులో ఆర్టీసీ బస్సులు
ఉత్తమ ఫలితాలే లక్ష్యం కావాలి
‘టెన్త్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి. జిల్లా అగ్రస్థానంలో నిలవాలి. పరీక్షల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. పరీక్ష కేంద్రానికి అర గంట ముందే చేరుకోవాలి. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికావొద్దు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాం’ అని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు టెన్త్ పరీక్షల నేపథ్యంలో ‘సాక్షి ’కి సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో డీఈఓ వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే.. – సాక్షి, సిద్దిపేట
జిల్లా వ్యాప్తంగా 15,337 మంది విద్యార్థులు పదో పరీక్షలు రాయనున్నారు. బాలురు 7,700, బాలికలు 7,637 మంది ఉన్నారు. వీరి కోసం 82 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాం. జిల్లాకు ఇప్పటికే ప్రశ్నపత్రాలు రావడంతో వాటిని ఆయా పరీక్ష కేంద్రాల పరిధిలోని పోలీస్‌స్టేషన్లలో భద్రపరిచాం. సీసీ కెమెరా నిఘాలో సీల్ తీసి, పరీక్ష ముగిసిన తర్వాత అదేచోట జవాబు పత్రాలను సీల్ వేసి తపాలా కార్యాలయం ద్వారా కేటాయించిన చిరునామాకు రిజిస్టర్ పోస్ట్ చేయనున్నాం.
జిరాక్స్ కేంద్రాలు మూసివేస్తాం
పరీక్ష కేంద్రాల వద్ద పరీక్ష సమయాల్లో జిరాక్స్ కేంద్రాలను మూసివేస్తాం. 82 మంది సీఎస్‌లు, 20 మంది విద్యార్థులకు చొప్పున ఒక్కో ఇన్విజిలేటర్లను ఇలా 848 మందిని నియమించాం. ఇప్పటికే సీఎస్‌లకు శిక్షణ ఇచ్చాం. పరీక్షల జిల్లా కమిటీ, సిట్టింగ్ స్క్వాడ్, ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు నిరంతరం పర్యవేక్షిస్తుంటుంది. ఎవరైనా నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటాం.
ఆరు సబ్జెక్టులు.. ఏడు పరీక్షలు
ఆరు సబ్జెక్ట్‌లు ఏడు పేపర్లలో పరీక్షలు జరగనున్నాయి. దీనిపై ముందుగానే విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కల్పించి ప్రీ ఫైనల్ పరీక్షలు సైతం నిర్వహించాం. ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు పరీక్షలు ఉండనున్నాయి. భౌతిక, జీవశాస్త్రం రెండు పేపర్లు ఉదయం 9:30గంటల నుంచి 11:30గంటల వరకు జరగనున్నాయి. నిమిషం నిబంధనను సడలించిన నేపథ్యంలో పరీక్ష ప్రారంభమైన తర్వాత 5 నిమిషాల వరకు మాత్రమే పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తాం.
ఒత్తిడికి గురికావద్దు
విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలి. విద్యార్థులు మొదట ప్రశ్నపత్రంను పూర్తిగా చదవాలి. ఆ తర్వాత వచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయాలి. తర్వాత రానీ వాటి గురించి ఆలోచించాలి. తల్లిదండ్రులు వారికి పోషక విలువలు కలిగిన ఆహారం అందించాలి. ఇప్పటికే ప్రత్యేక తరగతులు నిర్వహించాం. గత సంవత్సరం పదో తరగతి పరీక్షలకు సంబంధించిన సెట్–2తో ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించాం. అలాగే చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ఫోకస్ పెట్టి, ప్రత్యేక తరగతులు నిర్వహించాం.
ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా..
పదో తరగతిలో ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఉత్తీర్ణతలో 2022–23, 2023–24లలో రాష్ట్ర స్థాయిలో 2వ స్థానం, గత సంవత్సరం 25వ స్థానం సాధించాం. ఈ సారి టాప్ త్రీ స్థానాల్లో ఉండే విధంగా విద్యాభోధన అందించాం. ప్రతి పరీక్షకు 3, 4 రోజుల విరామం ఉంటుంది. పరీక్షల సమయంలోనూ ప్రత్యేక తరగతులు కొనసాగుతాయి.
‘సాక్షి’తో డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి
పరీక్ష సమయాల్లో ఆర్టీసీ బస్సులు
పదో తరగతి పరీక్షల నిమిత్తం జిల్లా కో ఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని ఇప్పటికే కలెక్టర్ హైమావతి ఏర్పాటు చేశారు. పరీక్షల సందర్భంగా విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకునేందుకు.. మళ్లీ ఇంటికి చేరేందుకు ఆ సమయాల్లో బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు, పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది, తాగునీటి ఏర్పాట్లు చేయాలని ఆయా అధికారులను కలెక్టర్ అదేశించారు.


