పురంలో వాడిన కమలం | - | Sakshi
Sakshi News home page

పురంలో వాడిన కమలం

Feb 18 2026 8:33 AM | Updated on Feb 18 2026 8:33 AM

పురంలో వాడిన కమలం

పురంలో వాడిన కమలం

బీజేపీకి మొత్తంగా 11శాతం ఓట్లే

మూడు వార్డుల్లోనే కౌన్సిలర్లుగా గెలుపు

దుబ్బాకలో ప్రత్యేక దృష్టి సారించినా ఫలితం శూన్యం

నిరాశలో కార్యకర్తలు

సాక్షి, సిద్దిపేట: మున్సిపల్‌ ఎన్నికల్లో కమలం వాడింది. ఇండిపెండెంట్లకు దక్కిన స్థానాలు సైతం గెలవక చతికిలపడింది. దీంతో ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఇద్దరు బీజేపీ ఎంపీల పరిధిలోకి వచ్చే మున్సిపాలిటీలు ఉన్నప్పటికీ పట్టణ ఎన్నికల ఫలితాలను చూస్తే పట్టుకోల్పోయిందన్న ప్రచారం జరుగుతోంది. హుస్నాబాద్‌, చేర్యాలలో ఒక్క సీటూ గెలవలేదు. మొత్తంగా బీజేపీకి 11.45శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. సంస్థాగతంగా పట్టణాల్లో బలోపేతం కావాలని ఉవ్విళ్లూరుతున్నా సత్తా చాటడంలో విఫలమైంది. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో 72 చోట్ల బీజేపీ అభ్యర్థులు పోటీ చేయగా కేవలం ముగ్గురే కౌన్సిలర్లు గెలుపొందారు. బీజేపీ నుంచి దుబ్బాకలో 2వ వార్డు కౌన్సిలర్‌గా గంబీపూర్‌ కనకరాజు, 8వ వార్డు కౌన్సిలర్‌గా మెరుపాల సాయికుమార్‌, గజ్వేల్‌లో 4వ వార్డు కౌన్సిలర్‌గా రొట్టెల శ్రీనివాస్‌లు గెలుపొందారు. నాలుగు మున్సిపాలిటీలలో 83,116 ఓట్లు పోలుకాగా బీజేపీకి 9,520(11.45 శాతం) ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఎంపీ ప్రత్యేక దృష్టిసారించినా..

మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు సొంత నియోజకవర్గం అయిన దుబ్బాకపై ప్రత్యేక దృష్టి సారించినా ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపలేదు. దుబ్బాకలో ఎంపీ రఘునందన్‌ రావుతో పాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలాగే హుస్నాబాద్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌, గజ్వేల్‌లో ఎంపీ ఈటల రాజేందర్‌ ప్రచారం చేశారు.

కార్యకర్తలు చతికిల

మెదక్‌, కరీంనగర్‌ ఎంపీలుగా రఘునందన్‌ రావు, బండి సంజయ్‌లు గెలుపొందడంతో పార్టీలో కొంత జోష్‌ కనిపించినా సర్పంచ్‌, మున్సిపల్‌ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలుపొందకపోవడంతో కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. రాబోయే కాలమంతా ఎన్నికల కాలం.. ఇలాంటి సమయంలో కేడర్‌ నిరుత్సాహంలో ఉంటే ఎలా అని కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జిల్లాలో జరగనున్నాయి. ఏప్రిల్‌లో సిద్దిపేట మున్సిపాలిటీ పదవీ కాలం ముగియనుంది. త్వరలో సిద్దిపేట మున్సిపాలిటీలో సైతం ఎన్నికలు జరగనున్నాయి. ఇలానే పరిస్థితి కొనసాగితే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలపై ప్రభావం పడే అవకాశాలున్నాయి.

పెరిగిన వర్గపోరు

జిల్లాలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు వర్గాలుగా విడిపోయారు. బీజేపీ అధ్యక్షునిగా బైరీ శంకర్‌ నియమితులైన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో పార్టీ సత్తా చాటలేకపోయింది. జిల్లాలో వర్గపోరు పెరిగిందని కార్యకర్తలు బాహాటంగా చర్చించుకుంటున్నారు. ఎన్నికల్లో వర్గపోరు తీవ్ర ప్రభావం చూపిందని అంటున్నారు. ఒక వర్గం నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండటం కూడా చేటుచేసిందని చెబుతున్నారు. ఇప్పటికైనా అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించి అందరినీ ఒక్కతాటి పైకి తీసుకవచ్చి పార్టీని ముందుకు తీసుకవెళ్లాలని కార్యకర్తలు కోరుతున్నారు.

మున్సిపాలిటీ బీజేపీకి వచ్చిన ఓట్లు

చేర్యాల 125

దుబ్బాక 3,487

గజ్వేల్‌ 4,421

హుస్నాబాద్‌ 1,487

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement