నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు
● కలెక్టర్ కె.హైమావతి హెచ్చరిక ● నాణ్యమైన భోజనం వడ్డించాలి ● మిట్టపల్లి గురుకుల, కేజీబీవీలో మధ్యాహ్న భోజనం పరిశీలన
సిద్దిపేటఅర్బన్: సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మెనూను తప్పనిసరిగా పాటిస్తూ నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని వడ్డించాలని కలెక్టర్ హైమావతి సూచించారు. శనివారం సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి శివారులోని కేజీబీవీ, సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను సందర్శించి మధ్యా హ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కేజీబీవీలో మెనూ ప్రకారం విద్యార్థులకు వడ్డిస్తున్న అన్నం, గుడ్డు, క్యాలీఫ్లవర్ కూర, పప్పు, రసం, పెరుగు నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు డైనింగ్ హాలులో మాత్రమే భోజనం వడ్డించాలని, ఇతర చోట్ల వడ్డించవద్దని సూచించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ భోజనం చేసే సమ యంలో క్రమశిక్షణతో కూడిన మంచి అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు. వంట గది పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలని తెలిపారు. మిట్టపల్లి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్.. కూరల నాణ్యత సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.


