‘జిజ్ఞాస’తో పరిశోధనా పరిజ్ఞానం
● డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత ● అధ్యాపకులకు అవగాహన కార్యక్రమం
సిద్దిపేట ఎడ్యుకేషన్: జిజ్ఞాస ప్రాజెక్టుతో నైపుణ్యం మెరుగవుతుందని, పరిశోధనా పరిజ్ఞానం పెరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, జిజ్ఞాస ప్రాజెక్టు కో ఆర్డినేటర్ డాక్టర్ రవికుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆటానమస్)లో బుధవారం అధ్యాపకులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిజ్ఞాస ప్రాజెక్టు విద్యార్థుల్లో పరిశోధన దృక్పథాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సమస్యలు విశ్లేషించే సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తుందన్నారు. అధ్యాపకుల మార్గదర్శకత్వంతో విద్యార్థులు చిన్న స్థాయి పరిశోధన ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా వారి అకాడమిక్ నైపుణ్యాలు మరింత మెరుగుపడతాయన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో శాసీ్త్రయ జిజ్ఞాస, సృజనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార సామర్థ్యం పెంపొందించడమే ముఖ్య లక్ష్యమని తెలిపారు. అధ్యాపకులు మెంటర్లుగా వ్యవహరిస్తూ ప్రాజెక్టుల ఎంపిక, అమలు, నివేదిక తయారీలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని సూచించారు. నాణ్యతా ప్రమాణాలు, ఉత్తమ విద్యా ఆచరణలకు అనుగుణంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టుపై ఆసక్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ సుదర్శనం, డాక్టర్ మధుసూదన్, డాక్టర్ గురు చరణ్ దాస్, జిజ్ఞాస కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


