ఏర్పాట్ల జోరు
మున్సిపల్ ఎన్నికలకు యంత్రాంగం సన్నద్ధం
రెండు వార్డులకొక నామినేషన్ స్వీకరణ కేంద్రం
నాలుగు మున్సిపాలిటీల్లో 72 వార్డులు
నాలుగు కౌంటింగ్ కేంద్రాల గుర్తింపు
నేడు ఆర్వోలు, ఏఆర్వోలకుకలెక్టరేట్‌లో శిక్షణ
పుర పోరు..
జిల్లాలో నాలుగు పురపాలక సంఘాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో ఎన్నికల షెడ్యూల్ వెలువడనుండటంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆయా మున్సిపాలిటీలలో ఇప్పటికే వార్డులు, చైర్మన్ల వారీగా రిజర్వేషన్లు ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా ఎన్నికలను నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. అందులో భాగంగా శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో రిటర్నింగ్ అధికారి(ఆర్వో), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి(ఏఆర్వో)లకు శిక్షణ ఇవ్వనున్నారు.
– సాక్షి, సిద్దిపేట
జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలలో 72 వార్డులకు ఎన్నికలకు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్ పత్రాల స్వీకరణ కోసం రెండు వార్డులకు కలిపి ఒక చోట నామినేషన్ స్వీకరణ కౌంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందు కోసం 49 ఆర్వోలు, 49 మంది ఏఆర్వోలను నియమించారు. వీటిలోనే 20శాతం అధికారులను రిజర్వులో ఉంచనున్నారు. ఇప్పటికే అధికారులకు ఆర్వో, ఏఆర్వోలకు సంబంధించి ఆర్డర్లను పంపించారు.
176 పోలింగ్ కేంద్రాలు
నాలుగు మున్సిపాలిటీలలో 176 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 198 బ్యాలెట్ బాక్స్‌లు అవసరం ఉంటాయని ఆయా మున్సిపల్ కమిషనర్లు ఇప్పటికే డీపీఓకు లేఖలు అందించారు. దీంతో వాటిని మరమ్మతులు, శుభ్రం చేసి సిద్ధంగా ఉంచారు. త్వరలో వాటిని ఆయా మున్సిపాలిటీలు తీసుకవెళ్లనున్నాయి. బ్యాలెట్ బాక్స్‌లు భద్రపరిచేందుకు, డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్, ఓట్ల లెక్కింపు కేంద్రాలన్నీ ఒకే దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. చేర్యాలకు సంబంధించి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, హుస్నాబాద్‌లో తెలంగాణ మోడల్ స్కూల్, దుబ్బాకలో లచ్చపేట మోడల్ స్కూల్, గజ్వేల్‌లో బాలికల ఎడ్యుకేషన్ హబ్‌లలో ఏర్పాటు చేయనున్నారు.
13మంది నోడల్
అధికారుల నియామకం
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 13 మంది నోడల్ అధికారుల నియమించారు. మ్యాన్‌పవర్ మేనేజ్‌మెంట్, వెబ్‌క్యాస్టింగ్, కోడ్ అమలు, సహాయ కేంద్రం, ఫిర్యాదుల పరిశీలన, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ట్రాన్స్‌పోర్ట్, శిక్షణ నిర్వహణ, మెటీరియల్ మేనేజ్‌మెంట్, ఖర్చులు, పరిశీలకులు, మీడియా కమ్యూనికేషన్, నివేదికల తయారీ తదితర సంబంధించి 13 మందిని నియమించారు. వారికి బాధ్యతలను అప్పగించనున్నారు.
మున్సిపాలిటీ వార్డులు పోలింగ్
కేంద్రాల సంఖ్య
చేర్యాల 12 24
దుబ్బాక 20 41
హుస్నాబాద్ 20 40
గజ్వేల్ 20 71
పకడ్బందీ చర్యలు
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలతో పాటు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. పకడ్బందీ చర్యలు చేపట్టాం. మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్లను స్వీకరించనున్నాం. హుస్నాబాద్‌లో మోడల్ స్కూల్ కౌంటింగ్, స్ట్రాంగ్ రూంను ఏర్పాటు చేశాం.
– మల్లికార్జున్, కమిషనర్,
పురపాలక సంఘం, హుస్నాబాద్
సిద్ధంగా ఉన్నాం: కలెక్టర్ హైమావతి
సిద్దిపేటరూరల్: మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ హైమావతి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతాధికారులకు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ హైమావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల, గజ్వేల్ మున్సిపాలిటీలలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
ఏర్పాట్ల జోరు


