సౌరశక్తితో స్వయం సమృద్ధి సాధ్యం
● టీజీ రెడ్కో జిల్లా మేనేజర్ రవీందర్ చౌహన్ ● మోడల్ సోలార్ గ్రామంగా రామవరం ఎంపిక
అక్కన్నపేట(హుస్నాబాద్): సౌరశక్తి వినియోగం ద్వారా గ్రామాలు విద్యుత్ స్వయం సమృద్ధి సాధించవచ్చని తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీ రెడ్కో) జిల్లా మేనేజర్ లావుడ్య రవీందర్ చౌహన్ అన్నారు. మంగళవారం అక్కన్నపేట మండలం రామవరం గ్రామపంచాయతీ కార్యాలయంలో సౌరశక్తి వినియోగంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముస్త్ బిజిలీ యోజన(పీఎంఎస్‌ఎంబీవై) పథకంలో భాగంగా ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రామవరం గ్రామాన్ని ఎంపిక చేసిందన్నారు. ఇళ్లపై రెండు కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ యూనిట్లను ప్రభుత్వం ఉచితంగా ఏర్పాటు చేస్తుందన్నారు. గృహ అవసరాలకు వినియోగించిన తరువాత మిగిలిన విద్యుత్‌ను నెట్‌మీటర్ ద్వారా గ్రిడ్‌కు అనుసంధానం చేస్తే వినియోగదారులు అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బానోతు జయరాం, ఎంపీఓ శివనగేష్, సర్పంచ్ బొమ్మ శైశ్రీలం, పంచాయతీ కార్యదర్శి రాము, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.


