పుర బరి.. పార్టీల గురి | - | Sakshi
Sakshi News home page

పుర బరి.. పార్టీల గురి

Jan 20 2026 10:20 AM | Updated on Jan 20 2026 10:20 AM

పుర బరి.. పార్టీల గురి

పుర బరి.. పార్టీల గురి

అభ్యర్థుల ఎంపికలో ముమ్మర కసరత్తు

బీఆర్‌ఎస్‌లో సమన్వయ కర్తలనియామకం మెదక్‌ పార్లమెంట్‌కు ఇన్‌చార్జిగా మంత్రి వివేక్‌కు బాధ్యతలు బీజేపీ అధిష్టానం ప్రత్యేక ఫోకస్‌

అభ్యర్థుల ఎంపికలో ముమ్మర కసరత్తు

సాక్షి, సిద్దిపేట: మున్సిపల్‌ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు కావడంతో రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలు రూపొందించుకునే పనిలో పడ్డాయి. ఆశావహుల సామాజిక వర్గాలు, పార్టీకి చేసిన సేవతోపాటు ఆయా వార్డుల్లో వారికి ఉన్న గుర్తింపు ఆర్థిక బలాలను అంచనా వేస్తున్నారు. ఆయా వార్డుల్లో ఎవరికి టికెట్‌ ఇస్తే గెలుపొందే అవకాశాలుంటాయన్న దానిపై ముఖ్యనాయకులతో చర్చిస్తున్నారు. గెలుపు గుర్రాల అన్వేషణలో పడ్డారు.

నాలుగు మున్సిపాలిటీలు

జిల్లాలో గజ్వేల్‌, దుబ్బాక, హుస్నాబాద్‌, చేర్యాల మున్సిపాలిటీలకు ఎన్నికల నిర్వహణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ నాలుగు మున్సిపాలిటీలలో 72 వార్డులున్నాయి. రిజర్వేషన్ల ప్రకటనకు ముందు ఎక్కువ సంఖ్యలో నేనంటే.. నేను అని పోటీపడ్డారు. రిజర్వేషన్లు వెల్లడయ్యే సరికి పలువురికి కలిసి రాకపోవడంతో నిరాశ చెంది తటస్థంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలో ముఖ్యనాయకులు తమ అభ్యర్థుల ఎంపికకు కసరత్తు ప్రారంభించారు.

బీఆర్‌ఎస్‌ దూకుడు

జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలను బీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా సమన్వయకర్తలను నియమించారు. గజ్వేల్‌ మున్సిపాలిటీకి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాదాకృష్ణ శర్మ, దుబ్బాకకు గుండు భూపేశ్‌లను నియమించారు. ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల సమన్వయకర్తలు పట్టణ ముఖ్యనాయకులతో సమావేశాలు నిర్వహించారు. వార్డుల వారీగా ఇన్‌చార్జిలను నియమించి దిశానిర్దేశం చేశారు. అభ్యర్థుల ఎంపిక గురించి చర్చించారు. ఎక్కువ మంది పోటీ ఉండే చోట ఆశావహులు, ఇన్‌చార్జిలతో సమావేశం అవుతున్నారు. హుస్నాబాద్‌, చేర్యాలకు త్వరలో ఇన్‌చార్జిలను నియమించే అవకాశాలున్నాయి.

మంత్రి వివేక్‌కు బాధ్యతలు

నాలుగు మున్సిపాలిటీలలో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్‌ పార్టీ పావులు కదుపుతోంది. మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలోని మున్సిపాలిటీలకు ఇన్‌చార్జిగా మంత్రి వివేక్‌ వెంకటస్వామి, కరీంనగర్‌ పార్లమెంట్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, భువనగిరి పార్లమెంట్‌ సెగ్మెంట్‌కు ఇన్‌చార్జిగా మంత్రి సీతక్కను నియమించి బాధ్యతలను అధిష్టానం అప్పగించింది. వీరు ఒకటి రెండు రోజుల్లో మున్సిపాలిటీల వారీగా ఇన్‌చార్జిలను నియమించనున్నారు. గజ్వేల్‌లో ఇప్పటికే ఆశావహులతో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిలు సమావేశం అవుతున్నారు. అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడ్డారు.

బీజేపీ అధిష్టానం జిల్లాకు చెందిన ముఖ్యనాయకులతో ఇటీవల హైదరాబాద్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు అనుసరించాల్సిన విధానాలపై వివరించారు. మున్సిపాలిటీల వారీగా పార్టీ ఇన్‌చార్జిలను నియమించేందుకు కసరత్తు మొదలుపెట్టారు. ఇన్‌చార్జిలుగా నియమించేందుకు పలువురు పేర్లను అధిష్టానం సేకరించినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో నియమించే అవకాశాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement