గ్రామాభివృద్ధికి తోడ్పడండి
● కలెక్టర్ హైమావతి ● నూతన సర్పంచ్‌లకు దిశానిర్దేశం ● గ్రామ పరిపాలనపై శిక్షణ ప్రారంభం
సిద్దిపేటఅర్బన్: ఉత్తమ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు సర్పంచ్‌లు నిరంతరం కృషి చేయాలని కలెక్టర్ హైమావతి సూచించారు. సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లి శివారులోని న్యాక్ భవనంలో 5 మండలాల నూతన సర్పంచ్‌లకు గ్రామ పరిపాలనపై అందించే శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవ చేసేందుకు సర్పంచ్‌లకు దేవుడు ఇచ్చిన సువర్ణావకాశాన్ని పవిత్రంగా భావించి నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. గ్రామంలో ఏ పనులు ఎలా చేయాలి? గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ప్రణాళిక రూపొందించుకోవడానికి శిక్షణ తోడ్పడుతుందని అన్నారు. గ్రామాల్లో తాగు నీరు, పారిశుద్ధ్యం, సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్వహణ మొదటి ప్రాధాన్యతగా భావించాలన్నారు. డ్రై డే సరిగ్గా జరిగేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే గ్రాంట్లు అన్ని సక్రమంగా ఖర్చు చేసే బాధ్యత సర్పంచ్‌లపై ఉందని అన్నారు. గ్రామాలలో ఏ పని చేసినా వార్డు సభ్యుల ఆధ్వర్యంలో పంచాయతీ తీర్మానాల ఆధారంగానే పారదర్శకంగా పనిచేయాలని సూచించారు. పది కాలాల పాటు గుర్తుండేలా పనలు చేపట్టాలన్నారు. మహిళా సర్పంచ్‌లు.. పతులకు పెత్తనం అప్పగించకుండా అన్ని విషయాలు నేర్చుకొని ప్రతి పనిలో తమ భాగస్వామ్యం ఉండాలన్నారు. అనంతరం వివిధ విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రారంభించి తిలకించారు. కార్యక్రమంలో డీపీఓ రవీందర్, డీఆర్‌డీఓ జయదేవ్‌ఆర్య, ట్రైనీ డీపీఓ వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయండి
సిద్దిపేటరూరల్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో గణతంత్ర వేడుకల నిర్వహణపై జిల్లా అధికారులతో సమీక్షించి, ఆదేశాలు జారీ చేశారు. శకటాలు, స్టాళ్లు ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, కార్యక్రమానికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.


