మున్సిపాలిటీలకు కేంద్రం నుంచే నిధులు
● ఉపాధి పనిదినాలు పెంచినఘనత మోదీదే ● మెదక్ ఎంపీ రఘునందన్‌రావు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఉపాధి హామీ పనిదినాలను 125 రోజులకు పెంచిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మోదీ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడంతో పాటుగా, పథకాలలో మార్పులు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉపాధి హామీ పథకానికి కేవలం రూ.60వేల కోట్లు మాత్రమే నిధులు ఖర్చు చేశారన్నారు. బీజేపీ ప్రభుత్వం రూ.3లక్షల కోట్లు నిధులు వెచ్చించిందన్నారు. గాంధీ జీ కలలు కన్న రామరాజ్యం కాంగ్రెస్‌కు నచ్చదన్నారు. రేవంత్‌రెడ్డి రెండేళ్ల పాలనలో మున్సిపాలిటీలకు ఎన్ని నిధులు వెచ్చించారో చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను తామే ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రచారం చేసుకుంటుందన్నారు. గ్రామాలకు, మున్సిపాలిటీలకు నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తున్నాయన్నారు. బీఆర్‌ఎస్ నాయకులతో ఒరిగేదేమీ లేదన్నారు. మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శంకర్‌ముదిరాజ్, పట్టణ అధ్యక్షుడు బాసంగారి వెంకట్, దూది శ్రీకాంత్‌రెడ్డి, రాంచంద్రరెడ్డి, మార్కండేయులు, నలగామ శ్రీనివాస్, తాటికొండ శ్రీనివాస్, కనకయ్య పాల్గొన్నారు.


