హుస్నాబాద్ చుట్టూ రింగ్‌రోడ్డు
● పెద్ద నగరంగా తీర్చిదిద్దుతాం ● ‘నీటి పన్ను’ సమస్యలూ పరిష్కరిస్తాం ● మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్: కరీంనగర్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట నగరాల మాదిరిగా హుస్నాబాద్‌ను పెద్ద నగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం పట్టణంలోని 20 వార్డులల్లో 372 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. మహిళా సంఘాలకు రూ.1.13 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కు, మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. అలాగే 57 మంది మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రణాళికబద్దంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. అందులో భాగంగా హుస్నాబాద్ పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మిస్తామన్నారు. కరీంనగర్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట వెళ్లే వారు రింగ్ రోడ్డుకు లింక్ అయ్యేలా నక్లెస్ మాదిరిగా ప్లానింగ్ సర్వే చేస్తున్నామని తెలిపారు. కొత్తగా వ్యవసాయ మార్కెట్ యార్డు కోసం వంద ఎకరాల స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలో నీటి పన్ను సమస్యలను పరిష్కరిస్తామన్నారు. పన్నులు భారం కాకుండా ఇంటి పన్ను పై సమీక్ష నిర్వహిస్తామని వివరించారు. కమర్షియల్ ఇతర అవసరాల దానిపై గ్రేడ్‌లుగా వసూలు అయ్యేలా చేస్తామన్నారు. గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టుల నిర్మాణ పనులను వేగవంతం చేశామని తెలిపారు. అలాగే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు ఇస్తున్నట్లు తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలో మొదటి విడతగా 171 ఇళ్లు, ప్రస్తుతం 372 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని వివరించారు. కలెక్టర్ హైమావతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, డీఆర్‌ఓ నాగరాజమ్మ, ఆర్డీఓ రామ్మూర్తి, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ప్రజల ఆకాంక్ష మేరకు కరీంనగర్‌లో కలుపుతాం
హుస్నాబాద్: ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రిటైర్డ్ జడ్జిచే నివేదిక తయారు చేసి హుస్నాబాద్‌ను కరీంనగర్ జిల్లాలో కలుపుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సికింద్రాబాద్ గతంలో జిల్లా కాదని, జిల్లాల విభజన జరిగినప్పుడు సికింద్రాబాద్ కాకుండా మల్కాజిగిరి జిల్లా చేశారని మంత్రి గుర్తు చేశారు. హుస్నాబాద్‌ను బలవంతంగా సిద్దిపేటలో కలిపితే నిరసనలు, ఆమరణ దీక్షలు చేశారన్నారు. అప్పుడు ఇక్కడి నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారో ప్రజలకు చెప్పాలన్నారు. ప్రజల సౌకర్యాలకు అనుగుణంగా ప్రాంతాలు ఉండాలన్నారు. హుస్నాబాద్ మున్సిపల్‌లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. పార్టీ నిర్ణయం మేరకే మున్సిపల్ చైర్మన్ అవుతారని అన్నారు. స్థానిక నాయకులపై సర్వే జరుగుతుందని, గెలుపు ఆధారంగా టికెట్లు ఇస్తామని తెలిపారు.


