‘మైకోరైజా’తో మొక్కకు మేలు
ఏఈఓ నాగార్జున
తొగుట(దుబ్బాక): భూమిలో ఉన్న భాస్వరాన్ని మొక్కకు అందించేందుకు మైకోరైజా ఎంతో దోహద పడుతుందని ఏఈఓ నాగార్జున రైతులకు సూచించారు. మండలంలోని పెద్ద మాసాన్‌పల్లిలో మైకోరైజా తయారీపై శనివారం రైతులకు అవగాహన కల్పించారు. రైతులు రసాయన ఎరువులపై ఆధారపడకుండా జీవ ఎరువులు కూడా వినియోగించాలని సూచించారు. వెసిక్యూలర్ ఆర్భస్కులార్ మైకోరైజా అనేది ఉపయోగకరమైన శిలీంద్రాలని, అవి మొక్కల వేర్ల పనితీరును మెరుగుపరుస్తాయని చెప్పారు. భాస్వరం వంటి పోషకాలను సులభంగా మొక్కలకు చేరేలా చేస్తాయని, దీంతో భాస్వరం ఎరువుల అవసరం తగ్గుతుందన్నారు. అలాగే మొక్కల్లో నీటి ఎద్దడిని తట్టుకునే శక్తి పెరుగుతుందని చెప్పారు. అన్ని పంటలకు విత్తన శుద్ధి, నేల శుద్ధిలో ఈ మైకోరైజా వినియోగించవచ్చుని తెలిపారు.


