నేటి నుంచి సైన్స్ సంబురాలు
● ఒకేచోట ఇన్‌స్పెయిర్, సైన్స్ ఎగ్జిబిట్ల ప్రదర్శన
● ఏర్పాట్లు పూర్తి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం నుంచి ఇన్‌స్పెయిర్, సైన్స్ ఎగ్జిబిషన్ల ప్రదర్శన నిర్వహించనున్నారు. జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన చైర్మన్ కలెక్టర్, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన 187 ఇన్‌స్పైర్, 236 సైన్స్ ఎగ్జిబిట్లను, 5 ఉపాధ్యాయ ఎగ్జిబిట్లను ప్రదర్శించనున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా మన జిల్లాలోనే 187 ఇన్‌స్పైర్ ఎగ్జిబిట్‌లను ప్రదర్శించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు.
మూడు రోజులపాటు ప్రదర్శనలు
● సైన్స్ ఎగ్జిబిట్లను బుధ, గురు, శుక్రవారాల్లో ప్రదర్శించనున్నారు.
● ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ప్రదర్శన కొనసాగనుంది.
● జిల్లా స్థాయిలో రాణించిన ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపిక అవుతాయి.
● ప్రతి పాఠశాల నుంచి కనిష్టంగా ఒకటి, గరిష్టంగా రెండు ప్రాజెక్టులను ప్రదర్శించనున్నారు.
● ప్రతి రోజు దాదాపుగా 1000 మంది విద్యార్థులు తిలకించనున్నారు.
● ఇన్‌స్పైర్, సైన్స్ ఎగ్జిబిట్‌ల ప్రదర్శనకు గాను 13 కమిటీలను నియమించారు.
● ఈ కమిటీలు ఈ ఎగ్జిబిట్‌ల ప్రదర్శన పూర్తయ్యే వరకు సమన్వయంతో పనిచేసి, సైన్స్ ఎగ్జిబిషన్‌ను విజయవంతం చేయనున్నాయి.
13 కమిటీలతో సమన్వయం
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం నుంచి శుక్రవారం వరకు సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాం. అందుకు గాను 13 కమిటీలతో సమన్వయం చేస్తున్నాం. కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో ఈ ఇన్‌స్పైర్, సైన్స్ ఎగ్జిబిట్ల ప్రదర్శన జరుగుతుంది. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల ప్రత్యేక ఏర్పాట్లు చేశాం.
– కల్లెపల్లి శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి
నేటి నుంచి సైన్స్ సంబురాలు


