సెట్విన్ విస్తరణ
జోగిపేట, దుబ్బాకలో రెండు శిక్షణ కేంద్రాలు
● ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు ● జహీరాబాద్‌లో కొనసాగుతున్న వృత్తి నైపుణ్య కోర్సులు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉపాధి కల్పించే వృత్తులపై శిక్షణనిచ్చే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సెట్విన్ (సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ ప్రమోషన్, ట్రైనింగ్) జిల్లాలో తన సేవలను విస్తరిస్తోంది. ఇప్పటికే జహీరాబాద్ పట్టణంలో ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఈ సంస్థ ఉమ్మడి మెదక్ జిల్లాలో మరో రెండు చోట్ల ఈ కూడా నెలకొల్పాలని నిర్ణయించింది. సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంతోపాటు, సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లాయి.
జిల్లాలకు ఈ సంస్థ సేవల విస్తరణ
హైదరాబాద్ కేంద్రంగా సేవలందించే ఈ సంస్థ నగరంలో 21 చోట్ల ఈ శిక్షణ కేంద్రాలు పనిచేస్తున్నాయి. గతేడాది మరో రెండు కేంద్రాలను సిటీలో నెలకొల్పింది. ఇప్పటికే సిద్దిపేట, గజ్వేల్, కామారెడ్డి, డిచ్‌పల్లిలో ఈ కేంద్రాలు వృత్తిపరమైన శిక్షణ కోర్సులు అందిస్తున్నాయి. ఇప్పుడు జోగిపేటతోపాటు, దుబ్బాకలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దుబ్బాకలో ఈ కేంద్రం నిర్వహించేందుకు ఓ నాయకుడు ఉచితంగా భవనం ఇస్తానని ముందుకొచ్చారు. అలాగే జోగిపేటలోనూ ఈ కేంద్రాన్ని కొన్ని నెలల్లోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సెట్విన్ ఎండీ వేణుగోపాల్ పేర్కొన్నారు.
వేర్‌హౌస్, కాస్మెటాలజీ కోర్సులు..
మైనార్టీల కోసం ప్రత్యేకంగా వేర్‌హౌజ్, కాస్మెటాలజీ కోర్సులు ప్రారంభమవుతున్నాయి. పీఎంకేవీవై (ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన) పథకం కింద ఈ ఆరు నెలల కోర్సును జహీరాబాద్ కేంద్రంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బుధవారం నుంచి దరఖాస్తులు తీసుకున్నట్లు అడ్మినిస్ట్రేషన్ హెడ్ భరత్ తెలిపారు.
వృత్తి నైపుణ్య శిక్షణలు..
ఆధునిక కోర్సులు
సెట్విన్ ప్రధానంగా వృత్తిపరమైన నైపుణ్య శిక్షణ కోర్సులు అందిస్తుంది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి తగ్గట్టుగా కొన్ని ఆధునిక కోర్సులను కూడా నిర్వహిస్తోంది. జహీరాబాద్ సెంటర్‌లో ప్రస్తుతం సీసీటీవీ ఇన్‌స్టాలేషన్, మొబైల్, ఏసీ, ఫ్రిడ్జ్ రిపేర్ కోర్సులతోపాటు, ప్రీప్రైమరీ టీచర్ ట్రైనింగ్‌కోర్సులు, కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణనిస్తున్నారు. ప్రస్తుతం సుమారు 580 మంది ఈ కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారు. జోగిపేట, దుబ్బాకల్లో ఏర్పాటు చేయనున్న శిక్షణ కేంద్రాల్లో స్థానికంగా డిమాండ్ ఉన్న కోర్సులను ప్రారంభిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఈ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి ఇచ్చే సర్టిఫికెట్లు విదేశాల్లో సైతం అనుమతి ఉంటుంది. దీంతో చాలామంది యువత ఈ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ కోర్సులు పూర్తి చేసుకుని సర్టిఫికెట్లు పొందిన వారు ఇతర దేశాల్లో ఈ వృత్తుల్లో స్థిరపడుతున్నారు. ప్రధానంగా గల్ఫ్ దేశాల్లో ఈ వృత్తులకు మంచి డిమాండ్ ఉంది.


