జ్వాలా తోరణం.. తరించిన భక్తజనం
నాచగిరిలో వినూత్న కార్యక్రమం
వర్గల్(గజ్వేల్): ప్రసిద్ధ నాచగిరి క్షేత్రం వినూత్న కార్యక్రమాలతో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతోంది. ప్రతి నెలా గిరిప్రదక్షిణతో స్వాతి నక్షత్ర మహోత్సవానికి ప్రాధాన్యత చేకూర్చిన ఆలయవర్గాలు, తాజాగా కార్తీకమాసోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి వినూత్నమైన ‘జ్వాలాతోరణం’ కార్యక్రమం చేపట్టారు. పల్లకీపై సభామండపం వద్దకు వేంచేసిన లక్ష్మీనృసింహస్వామివారు అక్కడ భగభగ జ్వలిస్తున్న ‘జ్వాలా’తోరణాన్ని భక్తుల గోవింద, శివనామస్మరణల మధ్య పరిక్రమణ(దాటడం) చేశారు. తరువాత భక్తులు స్వామివారి అనుగ్రహం పొందారు. కార్తీకమాసంలో ఆలయాల వద్ద జ్వాలాతోరణం ఎంతో శుభకరమని, విశిష్టమని ఆలయ వేదపండితులు పేర్కొంటున్నారు.


