పుస్తకాల్లేవ్.. చదువెట్ల?
మరోవైపు పూర్తికావొస్తున్న సిలబస్ అయోమయంలో ఇంటర్ విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా 6,155 బుక్స్ అవసరం
కళాశాలలు తెరిచి ఐదు నెలలైనా అందని పుస్తకాలు
ఇంటర్మీడియెట్ సిలబస్ పూర్తికావొస్తోంది.. మరోవైపు పరీక్షలు ముంచుకొస్తున్నాయి. అయినా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటికీ పాఠ్య పుస్తకాలు అందలేదు. కళాశాలలు ప్రారంభమై ఐదు నెలలు కావొస్తున్నా అందకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడంలేదు. చేసేదిలేక కొందరు సీనియర్ల పాత పుస్తకాలతో, మరికొందరు ఇతరులపై ఆధారపడి సరిపెట్టుకుంటున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు దృష్టి సారించి పాఠ్యపుస్తకాలు అందేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. – సాక్షి, సిద్దిపేట
జిల్లా వ్యాప్తంగా 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. అందులో 5,350 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 2025–26 విద్యాసంవత్సరం జూన్‌లో తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే పేద విద్యార్థులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందజేస్తోంది. కళాశాల ప్రారంభోత్సవం రోజునే పాఠ్యపుస్తకాలను అందజేయాలి. పలువురు విద్యార్థులకు ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలను ఇవ్వకపోవడంతో కొందరు పాత పుస్తకాలను సీనియర్ల దగ్గర తీసుకున్నారు. మరికొందరు పాఠ్యపుస్తకాల కోసం ఇతరులపై ఆధారపడాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం కలిపి 5,350 మంది విద్యార్థులుండగా ఇంకా 6,155 పాఠ్య పుస్తకాలు రావాల్సి ఉంది. విద్యార్థులు చదువుకునేందుకు.. ఆధ్యాపకులు బోధించే పాఠాలు అర్థమయ్యేందుకు.. ఇంటి వద్ద పునశ్ఛరణ చేసుకునేందుకు పాఠ్య పుస్తకాలు ఎంతో అవసరం. పరీక్షలు సమీపిస్తున్నా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందలేదు. పుస్తకాల కోసం విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఉత్తీర్ణత శాతం తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికై నా ఉన్నత అధికారులు స్పందించి త్వరగా పాఠ్యపుస్తకాలు అందించాలని విద్యార్థులు కోరుతున్నారు.
ఇంటర్ దశ కీలకం
దుబ్బాక: విద్యార్థులకు ఇంటర్ దశ ఎంతో కీలకమైనదని ఇంటర్మీడియెట్ బోర్డు ఉమ్మడి మెదక్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ కిషన్ అన్నారు. గురువారం దుబ్బాక పట్టణంలోని ఎస్‌ఆర్, వాగ్దేవి జూనియర్ కళాశాలలతో పాటు లచ్చపేట మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలను, రామక్కపేట గురుకుల కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతులు, ప్రయోగశాలలు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలంటే భయపడకుండా బాగా చదవాలన్నారు. మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలన్నారు. అలాగే విద్యార్థులకు పలు సూచనలు చేశారు.


