కొండపోచమ్మసాగర్ కాల్వలో తరచూ ప్రమాదాలు
తెరపైకి భద్రతా చర్యలు...
వేగమైన ప్రవాహం కలిగిన కొండపోచమ్మసాగర్ కాల్వలోకి జారిపడితే ప్రాణాలు నీటిపాలవడం సహజపరిణామంగా మారుతోంది. తాజాగా ఆదివారం గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామానికి చెందిన వరుసకు అక్కాతమ్ముళ్లు రిషిక(13), మనీష్(11)లు కాల్వలో నీటమునిగి ప్రాణాలు కోల్పోవడం, అదే రోజు మేడ్చల్ జిల్లాలోని ఆర్మీ క్యాంటీన్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న విజయ్‌కుమార్ కుకునూర్‌పల్లి మండలం ముద్దాపూర్ వద్ద కొండపోచమ్మసాగర్ కాల్వలో మృత్యువాతకు గురికావడం తీవ్ర విషాదాన్ని నింపింది. గతంలోనూ ఈ కాల్వలో ఎన్నో ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం చోటుచేసుకున్నది. కొందరు నీటి ప్రవాహానికి పంపుహౌస్‌లవరకు కొట్టుకు వెళ్లి ప్రాణాలు విడిచారు. ఈ క్రమంలో భద్రతా చర్యలు తెరపైకి వస్తున్నాయి. ప్రధానంగా ప్రమాదకరంగా ఉన్న ప్రదేశాల్లో ఫెన్సింగ్ ఏర్పాటు, మెట్లు ఉన్న ఉన్న ద్వారాలను మూసేయడం, కాల్వపై తరుచూ పరిశీలనలు జరిపితేనే ఈ ప్రమాదాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. తాజాగా ప్రమాదాల నేపథ్యంలో సంబంధిత అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.
గజ్వేల్: మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మసాగర్‌కు వచ్చే కాల్వ మృత్యుఘంటికలను మోగిస్తోంది. ప్రవాహా వేగానికి క్షణాల్లో ప్రాణాలు నీటిలో కలిసిపోతున్నాయి. తాజాగా గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద ఇద్దరు చిన్నారులు, కుకునూర్‌పల్లి మండలం ముద్దాపూర్ వద్ద మరో వ్యక్తి మృతి చెందడం కలవరానికి గురిచేస్తున్నది. ఈనేపథ్యంలోనే భద్రతా ఏర్పాట్ల అంశం తెరపైకి వస్తున్నది.
చిన్నకోడూరు వద్ద నిర్మించిన రంగనాయక్ సాగర్ నుంచి మల్లన్నసాగర్ ప్రతిపాదిత స్థలానికి 16కిమీల గోదావరి నీళ్లను తరలించే సొరంగ మార్గాన్ని తీసుకొచ్చారు. అక్కడి నుంచి మల్లన్నసాగర్ రిజర్వాయర్‌తో ప్రమేయం లేకుండా కొండపోచమ్మ సాగర్‌కు కాల్వకు అనుసంధానం చేశారు. ఈ కాల్వ సామర్థ్యం 11,500క్యుసెక్కులు. ఈ రకంగా మల్లన్నసాగర్ ప్రతిపాదిత స్థలం నుంచి 28కిమీల పొడవున కొండపోచమ్మ సాగర్ వరకు కాలువల ద్వారా గోదావరి నీళ్లు వస్తున్నాయి. చూడటానికి గుంభనంగా కనిపించే ఈ నీళ్లు...వేగమైన ప్రవాహాన్ని కలిగిఉంటాయి. ఈ క్రమంలోనే కొడకండ్ల బ్రిడ్జి వద్ద భారీ ఆనకట్టను నిర్మించి నీటిని వదిలి కాల్వల ద్వారా గజ్వేల్ మండలం అక్కారం పంప్‌హౌస్ వద్దకు చేరుతాయి. ఇక్కడ 52 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోస్తారు. ఇందుకోసం పంప్‌హౌస్‌లో 27మెగావాట్ల విద్యుత్‌వాడకంతో 6 మోటార్లు పనిచేస్తున్నాయి. అక్కడి నుంచి 2.3 కిలోమీటర్ల వరకు పైప్‌లైన్ ద్వారా, ఆ తర్వాత కాల్వల మార్గం ద్వారా మర్కూక్ వద్ద నిర్మించనున్న పంప్‌హౌస్‌కు తరలిస్తారు. ఇక్కడ మరో 72 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోస్తారు. ఇందుకోసం 34 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 6 మోటార్లను వాడుతున్నారు. ఈ పంప్‌హౌస్ నుంచి పైపుల ద్వారా 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మసాగర్‌ను నింపుతారు.
ఇటీవల ఇద్దరు చిన్నారులు..
మరొకరి మృతితో విషాదఛాయలు
ప్రమాదకరంగా ఉన్న ప్రదేశాల్లో
ఫెన్సింగ్ అనివార్యం


