కలెక్టర్ హైమావతి
మహిళా ఉద్యోగులతో సమావేశం
మహిళా ఉద్యోగులతో కలెక్టర్ హైమావతి
సిద్దిపేటరూరల్: ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో మహిళలకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనం చేకూరుతున్నదని కలెక్టర్ హైమావతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్లో అన్నిశాఖల మహిళా ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గతంలో మహిళలకు ప్రత్యేక సంక్షేమ పథకాలు పరిమితంగానే ఉండేవని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారతకు ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఆరు గ్యారంటీలలో భాగంగా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, చేయూత వంటి అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఇప్పటివరకు దాదాపు రూ.10 వేల కోట్లను ఆదా చేసుకున్నారన్నారు. సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్–ప్రజ్ఞాపూర్, దుబ్బాక డిపోల ద్వారా 866.66 లక్షల మంది మహిళలు ప్రయాణించి రూ.333కోట్లకుపైగా ఆదా చేసుకున్నారన్నారు. ఆరు గ్యారంటీలలో భాగంగా దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, జనగాం, మానకొండూర్, సిద్దిపేట నియోజకవర్గాల్లో 3,33,332 తెల్ల రేషన్ కార్డులను 10,37,262 మంది లబ్ధిదారులకు అందజేసి, ప్రతినెలా 6,583.867 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 11,241 ఇళ్లను మంజూరు చేశామన్నారు. వాటిలో 9,854 ఇళ్లకు గ్రౌండింగ్ పూర్తి చేసి రూ.204.44 కోట్ల విలువైన ఇళ్లను లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. రైతు భరోసా పథకం ద్వారా జిల్లాలో 3,20,379 మంది రైతులకు రూ.355.68 కోట్లు ఖాతాలో జమచేశామన్నారు. జిల్లాలో జరుగుతున్న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మహిళలు తమకు లభించిన ప్రయోజనాలను ప్రజలకు తెలియజేసి, సంక్షేమ పథకాల సద్వినియోగానికి తోడ్పడాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. పథకాలు మరింత మందికి చేరువ చేయడంలో మహిళలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఇకపై కలెక్టరేట్ ఎదరుగా వెళ్లే అన్ని డిపోల ఆర్టీసీ బస్సులు ఆఫీస్ ఎదుట ఆగేలా ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మహిళలను కలెక్టర్ సత్కరించారు.


