ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏప్రిల్ 1 నుంచి 23వ తేదీ వరకు పదో తరగతి పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహించనున్నట్లు డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం తెలిపారు. మూల్యాంకనం మూడు దశలలో నిర్వహించనున్నామన్నారు. మొదటి దశలో 1 నుంచి 9వ తేదీ వరకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్, గణితం సబ్జెక్టులు, 10వ తేదీ నుంచి 16 వరకు రెండో విడతలో భౌతిక రసాయశాస్త్రం, జీవశాస్త్రం, 17 నుంచి 23వ తేదీ వరకు సాంఘీకశాస్త్రం మూల్యాంకనం చేయనున్నట్లు తెలిపారు. ఈ మూల్యాంకన నిర్వహణలో మొత్తంగా 950 మంది విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. అందుకు గాను అన్ని రకాల మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా మూల్యాంకనం విధులకు హాజరు కానట్లయితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు డీఈఓ తెలిపారు.
యాజమాన్యపద్ధతులు తప్పనిసరి
చిన్నకోడూరు(సిద్దిపేట): సాగులో యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూప రాణి రైతులకు సూచించారు. మంగళవారం మండల పరిధిలోని రామంచలో వరి పంటలను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ సాగులో రైతులు రసాయనిక ఎరువులు తగ్గించాలన్నారు. పచ్చిరొట్ట ఎరువుల ద్వారా భూసారం పెరిగి మంచి దిగుబడులు వస్తాయన్నారు. వరికి కాండం తొలుచు పురుగు, మొగి పురుగు ఆశిస్తాయని, వాటి నివారణకు జాగ్రత్తలు వివరించారు. పంటల సాగులో చీడపీడలు, నివారణ, యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. ఆమె వెంట ఏఓ జయంత్ కుమార్, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.
గడువు పొడిగింపు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): స్వయం ఉపాధి పథకాల దరఖాస్తు గడువు పొడిగించారు. షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ స్వయం ఉపాధి పథకాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును ఏప్రిల్ 8 వరకు పొడిగించినట్లు సంస్థ ఈడీ విజయ భార్గవ తెలిపారు. అర్హత కల్గిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
హామీలు నెరవేర్చండి
మిరుదొడ్డి(దుబ్బాక): తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని దుబ్బాక ఉద్యమకారుల జేఏసీ కన్వీనర్ లింగం డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్‌ఐ కొండల్‌రెడ్డికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ఇప్పటికై నా ఉద్యమకారుల సంక్షేమంపై దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో ఉద్యమకారుల జేఏసీ మండల కన్వీనర్ భూపతి గౌడ్, ఉద్యమకారులు బాల్‌రాజు, నందిని మాస్టర్, స్వామి, విజయ్, రమేష్, సత్యనారాయణ, మల్లయ్య, భూమరాజయ్య, హరికృష్ణ, జ్ఞానేశ్వర్, హుస్సేన్, రాములు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా రథోత్సవం
బెజ్జంకి(సిద్దిపేట): దాచారంలో శ్రీరామచంద్రస్వామి రథోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. స్వామివారి ఉత్సవ మూర్తులను రథంపై ఉంచి గ్రామంలో ఊరేగించారు. భక్తుల రామనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.


