
జాతీయ క్రీడలకు వేదికగా పటాన్‌చెరు
పటాన్‌చెరు: క్రీడలకు, క్రీడాకారులకు కేంద్రంగా పటాన్‌చెరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతున్నామని..రాబోయే రోజుల్లో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు ఆతిథ్యం ఇవ్వబోతున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. మూడు రోజులుగా పటాన్‌చెరులోని మైత్రి మైదానం వేదికగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సౌజన్యంతో నిర్వహిస్తున్న 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) అండర్ 14 బాలుర, బాలికల కబడ్డీ ,అండర్ 17 బాలుర వాలీబాల్ విభాగం రాష్ట్రస్థాయి పోటీలు శనివారం ముగిశాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వాలీబాల్ జాతీయ స్థాయి క్రీడాకారుడు కృష్ణం రాజుతోపాటు రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమష్టికృషితో రాష్ట్రస్థాయి క్రీడలను విజయవంతం చేశామన్నారు. జాతీయ పోటీలకు ఎంపికై న క్రీడాకారులకు ఆర్థిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని వీరేశ్ మాట్లాడుతూ...క్రీడల పట్ల ఆసక్తి కలిగిన ఎమ్మెల్యే లభించడం పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజల అదృష్టం అన్నారు. రాబోయే రోజుల్లో జాతీయస్థాయి కబడ్డీ జట్టులో తెలంగాణ క్రీడాకారుల ప్రాతినిధ్యం పెరగాలని ఆకాంక్షించారు. కబడ్డీ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి జగదీశ్ యాదవ్ మాట్లాడుతూ..కబడ్డీ క్రీడలో జాతీయస్థాయిలో మెదక్ జిల్లా క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించడం ప్రశంసనీయమన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గం నుండి కబడ్డీ క్రీడాకారులు సైతం జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక కావాలని అభిలాషించారు.
మెదక్ జట్టు ఘన విజయం
శనివారం సాయంత్రం అభిమానుల మధ్య జరిగిన అండర్ 14 బాలుర కబడ్డీ ఫైనల్ మ్యాచ్‌లో నల్లగొండ జిల్లా జట్టుపై మెదక్ జట్టు ఘన విజయం సాధించింది..అండర్ 14 బాలికల కబడ్డీ ఫైనల్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జిల్లా జట్టు పైన ఖమ్మం జిల్లా జట్టు పైన ఘన విజయం సాధించింది. అండర్ 17 బాలుర వాలీబాల్ ఫైనల్ మ్యాచ్ లో వరంగల్ జిల్లా జట్టుపై ఖమ్మం జిల్లా జట్టు ఘన విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, పటాన్‌చెరు డీఎస్పీ ప్రభాకర్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, మాజీ కార్పొరేటర్ సపనా దేవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, గూడెం మధుసూదన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మైత్రి క్లబ్ అధ్యక్షుడు హనుమంత్‌రెడ్డి, ఎంఈవో లు పీపీ రాథోడ్, నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
ముగిసిన 69వ ఎస్‌జీఎఫ్
రాష్ట్రస్థాయి క్రీడలు