
వేగంగా సమాధానం ఇవ్వాలి
సిద్దిపేటరూరల్: ప్రజలు వారి అవసరాల కోసం ప్రభుత్వ శాఖల్లో సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం ఇచ్చిన దరఖాస్తులకు వేగంగా సమాచారం రూపంలో సమాధానం ఇవ్వాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో సమాచార హక్కు చట్టం– 2005 గురించి జిల్లాలోని అన్ని శాఖల పబ్లిక్ సమాచార అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా శాఖల వారీగా ఆర్టీఐ దరఖాస్తులు పెండింగ్ లేకుండా త్వరితగతిన అర్జిదారులకు అడిగిన సమాచారాన్ని పారదర్శకంగా నిర్ణీత సమయంలో అందించాలని కోరారు. సమాచార హక్కు చట్టం అనేది పౌరులకు ప్రభుత్వ కార్యాలయాల నుంచి సమాచారాన్ని పొందే హక్కును కల్పించే ఒక చట్టమన్నారు. ఈ చట్టం ద్వారా పౌరులు ప్రభుత్వ సంస్థలకు జవాబుదారీగా ఉండేలా చేయడం, అవినీతిని అరికట్టడం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం దీని ముఖ్య లక్ష్యమన్నారు. జిల్లాలో ఆయా శాఖలకు వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి ఏ సెక్షన్ ద్వారా అర్జిదారులకు జవాబు ఇవ్వాలో ప్రతి అధికారి తెలుసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆర్టీఐ చట్టంకు సంబంధించి పీఐఓ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఆర్టీఐ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో కలెక్టరేట్ ఏఓ అబ్దుల్ రెహమాన్, ఎంసీఎచ్‌అర్డీ రీజినల్ ట్రైనింగ్ మేనేజర్ భిక్షపతి పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్
ఆర్‌టీఐ దరఖాస్తులపై సమీక్ష