సెటిల్‌మెంట్లు జాన్తానై.. | - | Sakshi
Sakshi News home page

సెటిల్‌మెంట్లు జాన్తానై..

Oct 9 2025 8:03 AM | Updated on Oct 9 2025 8:03 AM

సెటిల్‌మెంట్లు జాన్తానై..

సెటిల్‌మెంట్లు జాన్తానై..

రాజకీయ నాయకులు పరిధి దాటొద్దు రౌడీమూకలపై ఉక్కుపాదం ప్రజల రక్షణే ముఖ్యం ప్రశాంత వాతావరణంలో ‘స్థానిక’ ఎన్నికలు పకడ్బందీగా పోలీసింగ్‌ వ్యవస్థ చిట్‌చాట్‌లో సీపీ విజయ్‌కుమార్‌

ఎవరికీ డబ్బులివ్వొద్దు

సాక్షి, సిద్దిపేట/సిద్దిపేట కమాన్‌: ‘ప్రజా కేంద్రిత పోలీసింగ్‌ వ్యవస్థను పకడ్బందీగా కొనసాగించేందుకు టీం వర్క్‌తో ముందుకు సాగుతాం. ప్రజల భద్రతకు, రక్షణకు పెద్దపీట వేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకుంటాం. రౌడీలు, గుండాయిజం, సెటిల్‌మెంట్లు చేసే వారిపై ఉక్కుపాదం మోపుతాం’ అని పోలీస్‌కమిషనర్‌ ఎస్‌ఎం విజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు. బుధవారం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే..

వివాహిత మహిళలపై వేధింపుల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని నా దృష్టికి వచ్చింది. భరోసా, స్నేహిత సెంటర్లలో కౌన్సెలింగ్‌ ద్వారా పరిష్కారం కానీ కేసులను నమోదు చేస్తున్నాం. జిల్లాలో అనేక సమస్యలపై దృష్టి సారించి, ప్రజల రక్షణ, లా అండ్‌ ఆర్డర్‌కు అనుగుణంగా పని చేస్తాం. పేకాట, గంజాయి, అక్రమ ఇసుక రవాణ, ఇతర అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపుతాం.

సెటిల్‌మెంట్లకు తావులేదు..

భూ తగాదాలు, వివిధ గొడవల నేపథ్యంలో పోలీస్‌స్టేషన్లకు ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిలో కొందరు రాజకీయ నాయకులు మధ్యవర్తిగా వ్యవహరిస్తూ సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. అలాంటివి ఇక బంద్‌ చేయాలి. సెటిల్‌మెంట్లకు తావులేకుండా పోలీస్‌ అధికారులు కేసులు నమోదు చేయాలి. సాక్ష్యాలు సేకరించి చార్జీషీట్‌ ఫైల్‌ చేసి చట్టప్రకారం ముందుకు వెళ్లాలి. పోలీసులు పోలీసింగ్‌ చేయాలి. రాజకీయ నాయకులు రాజకీయాలు చేసుకోవాలి. ఎవరూ పరిధి దాటొద్దు. సెటిల్‌మెంట్లు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవు. ఎన్నికలు ప్రశాంత వాతవరణంలో జరిగేలా చర్యలు తీసుకుంటాం. దీని కోసం ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలి. జిల్లాలో ఇప్పటి వరకు 94 సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించాం. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ రౌడీయిజం, గుండాయిజం చేసేవాళ్లను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా నంగునూరు మండలంలో రాజకీయ నాయకులు ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు.

డ్రగ్స్‌ను తరిమికొడదాం

మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా డ్రగ్స్‌కు అలవాటైతే పోలీసులకు సమాచారం అందించాలి. యువత ఎక్కువగా డ్రగ్స్‌ బారిన పడుతున్నట్లు, మత్తుకు బానిస అవుతున్నట్లు దృష్టికి వచ్చింది. ‘డ్రగ్స్‌’పై నిఘా ముమ్మరం చేస్తాం. అందరం సమష్టి కృషితో డ్రగ్స్‌ నిర్మూలనకు కృషి చేయాలి.

ఇసుక అక్రమ రావాణాపై దృష్టి

ఇసుక, మట్టి రవాణా కోసం రెవెన్యూ, సంబంధిత అధికారుల అనుమతులు తీసుకోవాలి. అక్రమంగా రవాణ చేసే వారిని, సహకరించే వారిని ఉపేక్షించేది లేదు. క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. డీజేలకు అనుమతులు లేవు. మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటాం.

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ల జోలికి వెళ్లొద్దు

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు నిర్వహించవద్దు. అలాగే ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ జోలికి వెళ్లవద్దు. సైబర్‌ నేరాలపై అందరూ అప్రమత్తంగా ఉండాలి. సైబర్‌ మోసానికి గురైతే 1930, సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదు చేయాలి.

జిల్లాలోని సిద్దిపేట, హుస్నాబాద్‌, గజ్వేల్‌ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పోస్టుమార్టం కోసం ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వొద్దు. ఇది ఉచితంగా చేయాల్సిన పని. పోస్టుమార్టం కోసం బాదితుల నుంచి పోలీసులు, వైద్య సిబ్బంది డబ్బులు వసూలు చేస్తే నేరం. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement