
వార్షిక పరీక్షలకు సిద్ధంకండి
జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్ రెడ్డి
చిన్నకోడూరు(సిద్దిపేట): వార్షిక పరీక్షలకు సమయం దగ్గరపడుతోందని, విద్యార్థులు సిద్ధం కావాలని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి రవీందర్‌రెడ్డి అన్నారు. బుధవారం చిన్నకోడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల హాజరు శాతం, కళాశాల పరిసరాలు, రికార్డులు, టీచింగ్ డైరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. అధ్యాపకులు బోధించే ప్రతీ అంశాన్ని శ్రద్ధగా వినాలని, అర్థం కాకపోతే అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. వచ్చే విద్యాసంవత్సరంలో కళాశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని అధ్యాపకులకు సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, అధ్యాపకులు ఉన్నారు.
వ్యవసాయ రంగంలో మార్పులు అవశ్యం
హుస్నాబాద్: కృత్రిమ మేధను ఉపయోగించడం ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావచ్చని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ భిక్షపతి అన్నారు. అక్కన్నపేట మండలం కుందనవాని పల్లెలో నాబార్డ్ సహకారంతో ఏర్పాటు చేసిన ఖేతీ రక్షక్ నెట్ హౌస్‌లో బుధవారం డిగ్రీ కళాశాల విద్యార్థులు క్షేత్ర పర్యటన చేశారు. కృత్రిమ మేధను ఉపయోగించి వ్యవసాయ పంటల పరిరక్షణ ఏ విధంగా చేయవచ్చో అగ్రిదూత్ అనే యాప్ సహ వ్యవస్థాపకుడు శాశ్వత రాజ్ వివరించారు. పంటలకు వచ్చే తెగుళ్లు, తేమ శాతం, శీతోష్ణస్థితి పరిస్థితులు మొదలైనవి ఒక క్లిక్‌తో తెలుసుకోవచ్చని యాప్ వినియోగాన్ని విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి తస్లీమా, విస్తరణ అధికారి శ్రీలత, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
భవిష్యత్తులో
టెన్త్ మార్కులు కీలకం
డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి
కొండపాక(గజ్వేల్): భవిష్యత్తులో 10వ తరగతి పరీక్షల మార్కులే కీలకంగా మారనున్నాయని డీఈఓ ఎల్లంకి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కుకునూరుపల్లి హైస్కూల్‌లో టెన్త్ ప్రత్యేక తరగతుల నిర్వహణను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించేలా విద్యార్థులు దృష్టి సారించాలన్నారు. కష్టంగా కాకుండా ఇష్టంగా చదివినప్పుడే మంచి ఫలితాలను సాధిస్తారన్నారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించేలా విద్యార్థులు కృషి చేయాలన్నారు. అంతకు ముందు టెన్త్‌లోని పలు సబ్జెక్టుల్లో ప్రశ్నలడిగి సమాధానాలు రాబట్టారు. ఇటీవల జిల్లా స్థాయి జూనియర్ బాలికల కబడ్డీ, వాలీబాల్ క్రీడల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ రాజ్‌కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కనులపండువగా బొడ్రాయి ప్రతిష్ఠామహోత్సవాలు
దుబ్బాక: పట్టణంలో బొడ్రాయి(నాభిశిల) ప్రతిష్ఠామహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రధాన వీధుల గుండా విగ్రహాల శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు విగ్రహాలకు మంగళహారతులతో స్వాగతం పలికి గంగాజలంతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది.

వార్షిక పరీక్షలకు సిద్ధంకండి