
పొదుపు చేస్తేనే జీవితం మలుపు: ఎమ్మెల్సీ
కొండపాక(గజ్వేల్): పొదుపును జీవన విధానంగా మార్చుకుంటేనే కుటుంబాలు బాగుపడుతాయని ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు. కొండపాక మండలంలోని మర్పడ్గలోని విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రం ఆవరణలో బుధవారం విధాత పొదుపు సంఘం 21వ వార్షిక మహాసభను నిర్వహించారు. ఈసందర్భంగా యాదవరెడ్డి మాట్లాడుతూ ప్రతీ మనిషి సంపాదనలో కొంత సొమ్మును పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలన్నారు. సంఘ భవన నిర్మాణానికి ఎమ్మెల్సీ నిధులను కేటాయిస్తామన్నారు. సంఘం అధ్యక్షులు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ 2003లో ప్రారంభమైన పొదుపు సంఘం నేడు రూ. 51లక్షలతో లావాదేవాలు కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వంపై, బ్యాంకులపై ఆధారపడకుండా పేదలకు ఆర్థిక స్వావలంబన కల్పించాలన్నదే పొదుపు లక్ష్యమన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 3.70లక్షల లాభం డబ్బులను తిరిగి సభ్యులకు బోనస్ రూపంలో అందించామన్నారు. సంఘంలోని ప్రతీ పైసా జమ, ఖర్చుల విషయమై ఆడిట్ ఉంటుందన్నారు. సంఘం సభ్యులు గడీల కుమార్ మృతి చెందడంతో కుటుంబానికి రూ. 41 వేలు, పిండి మల్లయ్య కుటుంబానికి రూ. 16 వేల పొదుపు, బోనస్ డబ్బులను అందజేశారు. కార్యక్రమంలో గ్రామీణ బ్యాంక్ మేనేజర్ శివప్రసాద్, సంఘం కోశాధికారి రవీందర్, సభ్యులు పాల్గొన్నారు.