
త్వరలో కిశోర బాలికల సంఘాలు
● కలెక్టర్ హైమావతి
● ఆరోగ్య, శిశుసంక్షేమ శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం
సిద్దిపేటరూరల్: మహిళా స్వయం సహాయక సంఘాల మాదిరే త్వరలో కిశోర బాలికల సంఘాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో గ్రామీణాభివృద్ధి శాఖ, పాఠశాల, ఇంటర్మీడియెట్, లేబర్, ఇండస్ట్రీస్, వైద్యారోగ్య, శిశు సంక్షేమ, సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు జిల్లాలోని కిశోర బాలికలతో సంఘాల ఏర్పాటుపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కిశోర బాలికల సంఘాల ఏర్పాటుతో ఎన్నో సామాజిక రుగ్మతలను తొలగించవచ్చన్నారు. 14 నుంచి 18 ఏళ్ల వయస్సు అనేది జీవితంలో అత్యంత కీలక దశ అని, ఈ దశలో సరైన మార్గదర్శకం ఇస్తేనే కౌమార బాలికలు సమాజానికి మార్గదర్శకులుగా మారతారన్నారు. బాల్యవివాహాలు, చదువు నిలిపివేయడం, రక్తహీనత, పోషకాహారలోపం, వేధింపులు వంటి ఎన్నో సవాళ్లు కౌమార దశలో బాలికలు ఎదుర్కొంటున్నారన్నారు. బాలికకు అవకాశాలు కల్పించడమే నిజమైన సాధికారతన్నారు. గ్రామాల వారీగా సెర్ప్, ఏపీఎంలు, సీసీలు, వీఓఏలు సంఘాలు ఏర్పాటు చేసేలా జిల్లా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, ఏడీఆర్డీఓ సుధీర్, డీఎంహెచ్‌ఓ, పరిశ్రమల శాఖ అధికారి గణేష్ రామ్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవీందర్‌రెడ్డి, లేబర్ ఆఫీసర్ శ్రీనివాస్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రేణుక, సెర్ప్ డీపీఎంలు, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌లో వేగం పెంచి నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియపై జూమ్ ద్వారా ఎంపీడీఓలు, ఎంపీఓ, హౌసింగ్ ఏఈ, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మార్కింగ్ చేశాక బేస్‌మెంట్ లెవల్‌లోకి రాని వారి వివరాలు తన వద్దకు తీసుకురావాలన్నారు. ఇంకా మార్కింగ్ చేయని వారితో మాట్లాడి సుముఖంగా లేని వారితో లెటర్ రాయించి తీసుకోవాలన్నారు. ఇసుక కొరత లేకుండా చూసుకోవాలని, ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు గృహాల నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగంగా పూర్తి చేసేలా చూడాలన్నారు.