
ఉచిత వైద్య శిబిరాలు పేదలకు వరం
● పల్లెల్లో ఆరోగ్య సేవలు అందించాలి
● అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్
అక్కన్నపేట(హుస్నాబాద్): మారుమూల పల్లెల్లో జ్వరాలు ప్రబలకుండా వైద్యబృందం ఎప్పటికప్పుడు సేవలను అందించాలని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ అన్నారు. అక్కన్నపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్యర్వంలో స్వస్థ్ నారి సశక్త్ పరివార్ అభియోన్ ద్వారా ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. స్వయంగా అక్కడే బీపీ పరీక్షలను చేయించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కంటి, దంత, ఘగర్, బీపీ, గర్భ, చర్మ తదితర సంబంధిత వ్యాధులకు పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఆరోగ్య శిబిరం పేదప్రజలకు వరంలాంటిదన్నారు. అలాగే ఆరోగ్య కేంద్రంలో చికిత్స తీసుకుంటున్న రోగల ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.
ఆయిల్‌పామ్‌తో అధిక లాభాలు
ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని గరీమా అగర్వాల్ రైతులకు సూచించారు. మండలంలోని మోత్కులపల్లికి చెందిన గొర్ల కొమురయ్య అనే రైతుకు చెందిన మూడెకరాల్లో వ్యవసాయ అధికారులతో కలిసి ఆమె మొక్కలను నాటారు. ఆమె మాట్లాడుతూ ఆయిల్‌పామ్ అన్ని రకాల భూముల్లో సాగు చేసుకోవచ్చున్నారు. అలాగే ప్రభుత్వం 90శాతం సబ్సిడీపై మొక్కలు, డ్రిప్ పరికరాలు అందిస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి, జిల్లా హార్టికల్చర్ అధికారి స్వరూప, ఎంపీడీఓ భానోతు జయరాం తదితరులు పాల్గొన్నారు.