
ఆలస్యమైతే.. ఆబ్సెంటే
● కొత్త విధానంతో చక్కటి సత్ఫలితాలు ● విధులు పూర్తయ్యే వరకుపాఠశాలల్లోనే.. ● ఆలస్యం, డుమ్మాలకు చెక్
ఉపాధ్యాయుల సమయపాలనకు ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు
హుస్నాబాద్: ఆలస్యం అనే పదం మరిచిపోవాల్సిందే.. సమయ పాలన పాటించాల్సిందే.. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు సమయపాలన పాటించేలా ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. కొత్త విధానంతో చక్కటి సత్ఫలితాలు వస్తున్నాయి. ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది సరైన సమయంలో హాజరు నమోదుకు ఎఫ్‌ఆర్‌ఎస్ సిస్టమ్‌ను అమల్లోకి తెచ్చిన విషయం విదితమే. ఈ నెల 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, రెసిడెన్సియల్ పాఠశాలల్లో ఎఫ్‌ఆర్‌ఎస్ (ఫేస్ రికగ్నైజేషన్) ద్వారా కొత్త హాజరు విధానాన్ని అమలు చేస్తున్నారు. గతంలో కొంత మంది ఉపాధ్యాయులు సమయ పాలన పాటించకపోవడం, ఉదయం, సాయంత్రం హాజరు వేసుకొని ఏదో పని ఉందని మధ్యాహ్నం డుమ్మా కొట్టిన దాఖలాలు ఉన్నాయి.
సమయం ముగిసే వరకు పాఠశాలలోనే..
ఎఫ్‌ఆర్‌ఎస్ సిస్టమ్‌తో ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది మొత్తం సమయం పూర్తి అయ్యే వరకు పాఠశాలలోనే విధులు నిర్వహించాల్సి ఉంది. ప్రార్థన సమయానికి ముందుగానే పాఠశాలకు చేరుకోవాలి. ఉదయం 9.05 గంటలకు ప్రత్యేక రూపొందించిన ఎఫ్‌ఆర్‌ఎస్ సిస్టమ్ ద్వారా సెల్‌ఫోన్‌లో ఫొటో దిగి అటెండెన్స్‌ను రికార్డు చేసుకోవాలి. తిరిగి విధులు పూర్తి చేసుకున్న తర్వాత సాయంత్రం 4.10 సమయంలో మళ్లీ ఫొటో దిగి హాజరు నమోదు చేసుకోవాలి. ఈ విధానంతో ఉపాధ్యాయులు పాఠశాలకు ఏ సమయంలో వస్తున్నారు? ఏ సమయంలో వెళుతున్నారు? అనేది స్పష్టంగా తెలుస్తోంది. పాఠశాలలోనే ఈ ఫొటో దిగాల్సి ఉంటుంది. కొంచెం ఆలస్యమైనా తెలిసి పోతుంది. దీంతో ఉపాధ్యాయులు, విద్యాభోదన పై సర్కార్ పర్యవేక్షణ పెరిగే అవకాశం ఉంది. అలాగే ఉపాధ్యాయుల సెలవులు కూడా ఆన్‌లైన్‌లో నమోదు అవుతాయి. ఉపాధ్యాయులు సమయ పాలన పాటిస్తే విద్యార్థులు కూడా సమయానికి వచ్చే అవకాశం ఉంది. ఈ విధానంతో విద్యాబోధన సాఫీగా సాగనుంది.
మంచి ఫలితాలు
ఎఫ్‌ఆర్‌ఎస్ సిస్టమ్‌తో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తున్నారు. ప్రార్థనకు ముందే ఉపాధ్యాయులు వచ్చి ఫొటో దిగి అటెండెన్స్ వేసుకోవాలి. గతంలో ఉపాధ్యాయులు ప్రార్థన వేళకు వస్తున్నారా? లేదా అనేది తెలిసేది కాదు. ఈ కొత్త విధానంతో సమయ పాలన పాటిస్తున్నారు.
– బండారి మనీల, ఎంఈఓ, హుస్నాబాద్

ఆలస్యమైతే.. ఆబ్సెంటే