
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
డీపీఓ దేవకీదేవి
నంగునూరు(సిద్దిపేట): దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి అర్జీలను పరిశీలించి అర్హత ఉన్న లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని డీపీఓ, మండల స్పెషలాఫీసర్ దేవకీదేవి అన్నారు. బుధవారం నంగునూరులో విలేకరులతో మాట్లాడుతూ ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్ చేశామన్నారు. మొదటి విడత జాబితాలో ఉన్న లబ్ధిదారులకు ప్రొసిడింగ్ కాపీలను అందజేశామన్నారు. ఇళ్లు మంజూరైన వారికి 8 ట్రాక్టర్ల ఇసుక ఉచితంగా అందజేస్తామని చెప్పారు. స్థానికంగా ఇసుక రీచ్‌లు లేకపోవడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు సిద్ది పేట నియోజకవర్గ లబ్ధిదారులకు నంగునూరు నుంచే తహసీల్దార్ ద్వారా టోకెన్ అందజేస్తారన్నారు. నంగునూరు మండలంలో మొదటి విడతలో 512 ఇళ్లు మంజూరు కాగా అందరికీ ప్రొసిడింగ్ కాపీలు అందజేశామని తెలిపారు. విడతల వారీగా అర్హులకు ఇళ్లు అందజేస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని, అందరూ సమన్వయం పాటించాలని సూచించారు. తహసీల్దార్ సరిత, ఎంపీడీఓ లక్ష్మణప్ప, హౌసింగ్ ఏఈ వివేక్ పాల్గొన్నారు.
ఎరువుల కోసం
ఆందోళన వద్దు
జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప రాణి
చిన్నకోడూరు(సిద్దిపేట): రైతులు ఆందోళన చెందవద్దని, సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప రాణి అన్నారు. బుధవారం మండల పరిధిలోని పలు గ్రామాల్లోని చిన్న చిన్న పరిశ్రమలు, పౌల్ట్రీ ఫామ్‌లు తదితర వాటిపై పోలీసులతో కలిసి దాడులు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యూరియాను పరిశ్రమలకు అక్రమంగా సరఫరా చేసినా, అక్రమంగా నిల్వలు చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుకాణదారులు ఈ పాస్ విధానంలోనే విక్రయించాలన్నారు.
శిశువుకు తల్లిపాలే దివ్యౌషధం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రతి శిశువుకు తల్లిపాలే దివ్యౌషధమని మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ దుర్గ అన్నారు. తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని సురభి నర్సింగ్ కళాశాల విద్యార్థులచే అవగాహన ర్యాలీ చేపట్టారు. బీజేఆర్ చౌరస్తాలో తల్లిపాల అవగాహన ర్యాలీని సీఐ జెండా ఊపి ప్రారంభించారు. సురభి నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బతాయి మాట్లాడుతూ, తల్లి పాల వారోత్సవాల సందర్భంగా రోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు