
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
● ప్రజలకు అవగాహన కల్పించాలి ● కలెక్టర్ హైమావతి
కొండపాక(గజ్వేల్): సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని, అలాగే ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ హైమావతి వైద్యాధికారులను ఆదేశించారు. కొండపాకలోని ప్రభుత్వ ఆస్పత్రిని బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆస్పత్రి పనితీరు, సిబ్బంది అటెండెన్స్ రిజిస్టరును పరిశీలించారు. సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందులు, పరికరాలు ఉన్నాయా అన్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా ఆసనాలపై ప్రజలకు ఆసక్తి కలిగేలా ఆయుష్ వైద్య సిబ్బంది కృషి చేయాలన్నారు. ఆస్పత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నరు. వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. కార్యక్రమంలో వైద్యలు శ్రీధర్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ దిక్సూచి.. ప్రొఫెసర్ జయశంకర్
సిద్దిపేటరూరల్: ప్రత్యేక రాష్ట్ర సాధనకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి కొత్తపల్లి జయశంకర్ అని కలెక్టర్ హైమావతి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధననే శ్వాసగా, ఆశయంగా తన జీవితాంతం పోరాడిన గొప్ప యోధుడు ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు. మేధావులు, యువకులు, ప్రజలతో నిరంతరం సభలు సమావేశాలు నిర్వహిస్తూ జాగృతం చేశారన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ప్రేరణగా నిలిచి ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, అబ్దుల్ హమీద్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, సీపీఓ దశరథం తదితరులు పాల్గొన్నారు.