
లక్ష్యం చేరేనా?
● జిల్లాలో 5.60 లక్షలఎకరాల సాగు అంచనా ● ఇప్పటివరకు 3.75లక్షల ఎకరాల్లోపే.. ● పలుచోట్ల లోటు వర్షపాతం నమోదు
గజ్వేల్: జిల్లాలో వానాకాలం సాగుకు సంబంధించి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. వరి నాట్లు ఆగుతూ.. సాగుతున్నాయి. 5.60లక్షల ఎకరాలకుపైగా పంటలు సాగులోకి వస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తే.. ఇప్పటివరకు 3.60లక్షల ఎకరాల్లోపే వివిధ రకాల పంటలు సాగులోకి వచ్చాయి. ప్రస్తుతం వరి సాగు పెరిగితేనే లక్ష్యం చేరుకునే అవకాశం ఉంది. సీజన్ ఆరంభం నుంచి ఇప్పటివరకు బోటాబోటీ వర్షపాతమే ఈ పరిస్థితికి కారణంగా మారింది.
జిల్లాలో ఇప్పటివరకు వరి 23,0393 ఎకరాల్లో సాగైంది. అదేవిధంగా పత్తి 10,6170ఎకరాల్లో, మొక్కజొన్న 25,972, కంది 6,028, పెసర్లు 216, స్వీట్‌కార్న్ 1,352, మినుములు 19ఎకరాల్లో సాగులోకి రాగా ఇతర పంటలు మరో 46ఎకరాల్లో సాగయ్యాయి. అంతంతమాత్రమే వర్షపాతం నమో దు కావడం ఈ పరిస్థితికి కారణంగా నిలుస్తోంది.
మొదట్లో వర్షాలు లేక..
సీజన్ ఆరంభం నుంచి 45రోజులకుపైగా వర్షాలు కురవలేదు. ఆ తర్వాత జూలై రెండు, మూడోవారాల్లో, ఆగస్టు నెలలో వర్షాలు కురిశాయి. పంటలకు కీలకమైన సమయంలో వర్షాల్లేకపోవడంవల్ల పత్తి, మొక్కజొన్న పంటలకు నష్టం జరిగింది. మరోవైపు సమృద్ధిగా వర్షాల్లేక వరి సాగు అనుకున్నంత వేగంగా సాగడం లేదు. భారీ వర్షాలు కురవడంతోపాటు మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగర్ రిజర్వాయర్ల నుంచి సాగునీటిని వదిలితేనే సాగు స్వరూపం మారి లక్ష్యం చేరుకునే అవకాశం ఉంది.
ఆరు మండలాల్లో లోటు వర్షపాతమే
జిల్లాలోని ఆరు మండలాల్లో ఇప్పటికీ లోటు వర్షపాతమే నమోదయ్యింది. ఇందులో భాగంగానే గజ్వేల్ మండలంలో జూన్ 1నుంచి ఇప్పటివరకు 322.7మి.మీల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 256.6మి.మీ.ల వర్షపాతం నమోదయ్యింది. ఈ లెక్కన 20.5శాతం మైనస్ వర్షపాతం నమోదయ్యింది.
అదేవిధంగా మిరుదొడ్డి మండలంలో 336.2 మి.మీ.లకు గాను 295.4 మి.మీల వర్షపాతం నమోదయ్యింది. దీంతో 12.1శాతం లోటు వర్షపాతం ఏర్పడింది.
రాయపోల్ మండలంలో 289.1మి.మీ.ల సాధారణ వర్షపాతానికి కేవలం 265.5 శాతం వర్షపాతం నెలకొంది. దీని ప్రకారం 8.2శాతం మైనస్ నమోదైంది.
కుకునూర్‌పల్లి మండలంలో 310.8మి.మీ.ల సాధారణ వర్షపాతానికి ఇప్పటివరకు 287.6మి.మీల వర్షపాతం ఏర్పడింది. ఈ లెక్కన 7.5మైనస్ వర్షపాతం నమోదయ్యింది.
చేర్యాల మండలంలో 313.6మి.మీ.లకు గాను.. ఇప్పటివరకు 303.6మి.మీల వర్షపాతం నమోదుకాగా 3.2శాతం వర్షపాతం లోటుగా ఉంది.
ములుగు మండలంలో 327.3మి.మీ.లకు గాను.. ఇప్పటివరకు 326.9మి.మీల వర్షపాతం నమోదయ్యింది. దీని ప్రకారం 0.1శాతం మైనస్ నమోదయ్యింది.
మిగిలిన 20మండలాల్లో సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదయినట్లు తెలుస్తోంది.