వ్రతం.. జన సందోహం

మాట్లాడుతున్న నవాజ్‌ సురేశ్‌ - Sakshi

వర్గల్‌(గజ్వేల్‌): ఉమ్మడి జిల్లాలో సుప్రసిద్ధమైన నాచగిరి శ్రీలక్ష్మీనృసింహ క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సామూహిక సత్యనారాయణ వ్రతాలు, సేవలు, అభిషేకాలతో అలరారింది. హైదరాబాద్‌, సికిందరాబాద్‌ జంట నగరాలు, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల నుంచి తరలివచ్చిన భక్తులు క్షేత్రంలో పుణ్యస్నానం ఆచరించారు. భక్తిశ్రద్ధలతో సత్యనారాయణస్వామి వ్రతంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. శని, ఆదివారాల్లో 58 సత్యనారాయణ వ్రతాలు, 21 సేవలు, 22 అభిషేకాలు జరిగినట్లు ఆలయవర్గాలు తెలిపాయి. సెలవురోజు కావడంతో పెద్దసంఖ్యలో భక్తులు నాచగిరీశుని దర్శించుకుని తరించారు.

పెండింగ్‌ బిల్లులను

వెంటనే చెల్లించాలి

తపస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

నవాజ్‌ సురేశ్‌

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): ప్రభుత్వం ఉపాధ్యాయులకు బకాయి ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని తపస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాజ్‌ సురేశ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం పట్టణంలోని శిశుమందిర్‌లో జిల్లా అధ్యక్షుడు ఊడెం రఘువర్ధన్‌ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బిల్లులన్నీ ఖజానా శాఖ ఆమోదం పొందినా, ఇంకా చెల్లించకపోవడం సరికాదన్నారు. సప్లిమెంటరీ వేతనాలు, పీఆర్సీ, డీఏ, పెన్షనరీ బకాయిలు, వైద్య బిల్లులు, సెలవు వేతనాలు, టీఎస్‌ జీఎల్‌ఐ, జీపీఎఫ్‌ కై ్లంలు తదితర పెండింగ్‌ బిల్లులను మార్చి 31 లోగా చెల్లించేలా చూడాలన్నారు. ప్రతీ నెల మొదటి తారీఖున జీతం అందించాలని, వేతనాలకు తగిన బడ్జెట్‌ను కేటాయించాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి, రాష్ట్ర బాధ్యులు తిరుపతి, శ్రీనాకర్‌ రెడ్డి, సింగోజు జనార్ధన్‌, నర్సిరెడ్డి, మహేందర్‌ రెడ్డి, శివకుమార్‌, జిల్లా బాధ్యులు, వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.

వడ్రంగి సమాజ అభివృద్ధికి కృషి చేస్తా

బీసీ బహుజన సంక్షేమ సంఘం

జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): వడ్రంగి సమాజ అభివృద్ధికి కృషి చేస్తానని బీసీ బహుజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సింగోజు మురళీకృష్ణ ఆచారి అన్నారు. ఆదివారం గాయత్రీ విశ్వకర్మ భగవాన్‌ దేవాలయ ఆవరణలో కొత్తపల్లి శంకరాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన సిద్దిపేట పట్టణ మను, మయ (వడ్రంగి) సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడిగా పబ్బోజు యాదగిరి ఆచారి, ప్రధాన కార్యదర్శిగా పుల్లయ్యగారి శ్రీనివాస్‌ ఆచారి, కోశాధికారిగా మేడోజు నర్సింహాచారి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మరళీకృష్ణ మాట్లాడుతూ.. నూతన కార్యవర్గ సభ్యులను ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని, సమస్యల పరిష్కారం, సంఘం అభివృద్ధికి సహకారం అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో సంఘం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Read latest Siddipet News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top