● కొనుగోలు కేంద్రాల్లో రైతుల పడిగాపులు ● ధాన్యం రవాణాలో తీవ్రం జాప్యం ● ఈసారి సేకరించిన వడ్లు గోదాంలకు తరలింపు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో ధాన్యం సేకరణ వేగం పుంజుకోవడం లేదు. బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరగడంతో పొటీ పడి ధాన్యం కొనుగోలు చేసిన వ్యాపారులు ఇప్పుడు చేతులెత్తేశారు. దీంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో తమ పంటను కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. తీరా ఇక్కడ కొనుగోళ్లు మందకొడిగా సాగుతుండటంతో ఇబ్బంది పడుతున్నారు. తూకం వేసిన ధాన్యాన్ని తరలించేందుకు లారీల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ధాన్యం దించేదెక్కడ..?
కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎక్కడ దించాలనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. గతంలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని నేరుగా మిల్లులకు పంపే వారు. కానీ సీఎంఆర్ బకాయిల కారణంగా ఈసారి ధాన్యాన్ని రైస్ మిల్లులకు కేటాయించే పరిస్థితి లేదు. బ్యాంకు గ్యారంటీలు, ఇతర నిబంధనల మేరకు ఉన్న మిల్లులకు మాత్రమే ఇప్పుడు ధాన్యాన్ని కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో జిల్లాలో 60కి పైగా మిల్లులుండగా, ప్రస్తుతానికి ఏడు మిల్లులకు మాత్రమే ధాన్యం కేటాయింపులు పరిమితమవుతున్నాయి. రెండు, మూడు రోజుల్లో మరిన్ని మిల్లులకు కేటాయింపులు చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. బ్యాంకు గ్యారంటీలు, ఇతర షరతులకు అంగీకరించిన మిల్లులకు ధాన్యాన్ని తరలిస్తామని చెబుతున్నారు.
233 కొనుగోలు కేంద్రాలు
జిల్లాలో ఈసారి 233 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వచ్చింది. అందులో సుమారు 16,355 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. ఇందులో 13,900 మెట్రిక్ టన్నులు రవాణా చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా 2,455 మెట్రిక్ టన్నుల దాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉంది. కాంటాలు వేసి.. సిద్ధంగా ఉంచిన రైతులు లారీల రాకకోసం వేచి చూస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రెండు, మూడు రోజుల్లో మరికొన్ని మిల్లుల్లో దాన్యం దించేందుకు చర్యలు చేపట్టామని అంటున్నారు. దీంతో సేకరణ వేగవంతం అవుతుందని చెబుతున్నారు.
అద్దె గోదాంలు నిండిపోయాయి
ఈసారి కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు అధికారులు ఎనిమిది గోదాంలను ఎంపిక చేశారు. సుమారు 21 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ఈ గోదాంల్లో ఇప్పటికే సుమారు 18 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేశారు. పైగా జహీరాబాద్ ప్రాంతంలో ఉన్న ఈ గోదాంలకు ధాన్యాన్ని తరలించడం అనేది వ్యయ ప్రయాసలతో కూడుకుంటోంది. పరిమిత సంఖ్యలో ఉన్న లారీలు ఆందోల్, సంగారెడ్డి ప్రాంతంలోని కొనుగోలు కేంద్రాల నుంచి జహీరాబాద్ ప్రాంతంలో ఉన్న గోదాంలకు రవాణా చేయడానికి చాలా సమయం పడుతోంది. దీంతో సకాలంలో లారీలు రాక రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు తప్పడం లేదు.


