ఆక్రమణల తొలగింపుపై
మున్సిపల్ చైర్మన్, కమిషనర్ సమీక్ష
మిగిలిన కట్టడాల పరిశీలన
జహీరాబాద్: పట్టణంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను తిరిగి ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధం అవుతోంది. బుధవారం మున్సిపల్ చైర్మన్ యూనూస్, కమిషనర్ ప్రభాకర్, టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాస్‌రావు హనుమాన్ మందిర రహదారిని పరిశీలించారు. ఈసందర్భంగా పలువురు వ్యాపారులతో మాట్లాడారు. ఆక్రమణల తొలగింపు, ప్రభావిత భవనాల కూల్చివేతకు అవసరమైన చర్యల గురించి సమీక్షించారు. రెండు నెలల క్రితం చేపట్టిన విస్తరణ పనులు సగం మేర పూర్తయ్యాయి. పలువురు కోర్టును ఆశ్రయించడంతో తాత్కాలికంగా పనులు నిలిచిపోయాయి. మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ మందిర్, భవాని మందిర్, లతీఫ్ రోడ్డును విస్తరించే పనులు ఇప్పటికే చేపట్టిన విషయం తెలిసిందే. సుమారు 250 వరకు నిర్మాణాలు కూల్చివేతలకు మార్కింగ్ వేసి గుర్తించారు. దీంతో పలువురు వ్యాపారులు, యజమానులు స్వచ్ఛందంగానే అక్రమ కట్టడాలు తొలగించుకున్నారు. విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్న సమయంలో కొందరు కోర్టును ఆశ్రయించారు. వారి ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలించిన అనంతరమే తదు పరి చర్యలు చేపట్టాలని కోర్టు సూచించడంతో పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. కాగా, ఇప్పటికే సదరు యజమానులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. వారి స్పందన అనంతరం పనులను తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. నిబంధన ప్రకారం రహదారుల విస్తరణ పనులను కొనసాగిస్తామని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావు లేదని కమిషనర్ స్పష్టం చేశారు.


