పది పరీక్ష ఫీజు చెల్లింపునకు నేడు ఆఖరు | - | Sakshi
Sakshi News home page

పది పరీక్ష ఫీజు చెల్లింపునకు నేడు ఆఖరు

Nov 26 2026 12:21 PM | Updated on Nov 26 2026 12:21 PM

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి ఆలస్య రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లింపు గడువు గురువారంతో ముగియనుందని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈనెల 16వ తేదీనే గడువు ముగిసినప్పటికీ, విద్యార్థుల సౌకర్యార్థం ఈనెల 26 వరకు పొడిగించినట్లు చెప్పారు. ఇప్పటివరకు ఫీజు చెల్లించని విద్యార్థులు తాము చదువుతున్న పాఠశాల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా వెంటనే చెల్లించాలని సూచించారు. రూ.50 అపరాధ రుసుముతో డిసెంబర్‌ 8 వరకు, రూ.200తో డిసెంబర్‌ 21 వరకు, రూ.500 అపరాధ రుసుముతో వచ్చే జనవరి 4వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా ఫీజు చెల్లించవచ్చని వివరించారు.

వందశాతం హాజరు

తప్పనిసరి: డీఈఓ

పటాన్‌చెరు టౌన్‌: విద్యార్థుల హాజరు వందశాతం ఉండేలా చూడాలని డీఈఓ రోహిణి అన్నారు. ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ పరిధి రుద్రారం వడ్డెర కాలనీలోని ప్రాథమిక పాఠశాలను బుధవారం ఆమె సందర్శించారు. పాఠశాల నిర్వహణ, విద్యార్థుల హాజరు వివరాలను పరిశీలించారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌లో విద్యార్థుల హాజరు శాతం తక్కువగా నమోదు కావడంపై ఆరా తీశారు. ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు తరచూ గైర్హాజరు కాకుండా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని తెలిపారు.

బాబోయ్‌.. ఎంత పెద్ద పాము

చిన్నశంకరంపేట(మెదక్‌): మండలంలోని మిర్జాపల్లిలో పొడవైన తాడిజెర్రి పాము కలకలం రేపింది. బుధవారం గ్రామంలోని ఎస్సీ కాలనికి చెందిన బాబు ఇంట్లోకి చొరబడటంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. పామును గమనించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. అదే గ్రామానికి చెందిన పెద్దులు అనే వ్యక్తి ముందుకొని పాము పట్టుకొని చంపేశాడు. దానిని చూసిన స్థానికులు బాబాయ్‌.. ఎంత పెద్ద పాయో అంటూ ఆశ్చర్యానికి గురయ్యారు.

డంపింగ్‌ యార్డును

తరలించండి

నర్సాపూర్‌ రూరల్‌: డంపింగ్‌ యార్డును తరలించాలని కోరుతూ నర్సాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు చైతన్యపురి కాలనీ, పెద్దచింతకుంట పంచాయతీ పరిధిలోని పాప్యా తండావాసులు బుధవారం ఆర్డీఓ, మున్సిపల్‌ కమిషనర్‌, ఎఫ్‌ఆర్‌ఓలకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. నర్సాపూర్‌ గురుకుల పాఠశాల సమీపంలో ఉన్న డంపింగ్‌ యార్డుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్వాసన, ఈగలు దోమల బెడదతో అనారోగ్యం బారిన పడుతున్నట్లు చెప్పారు. పంట పొలాలు సైతం దెబ్బతింటున్నాయని వాపోయారు.

‘ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం’

నర్సాపూర్‌ రూరల్‌: టీపీసీసీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో నిర్వహించే ‘ఓటు బచావో– దేశ్‌ బచావో’ సంవిధాన్‌ ర్యాలీకి పార్టీలకతీతంగా పెద్దఎత్తున తరలిరావాలని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్‌, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం వారు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ఓట్లు తొలగించబడ్డాయన్నారు. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ర్యాలీ ట్యాంక్‌బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం నుంచి నెక్లెస్‌ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు కొనసాగుతుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement