చేగుంట(తూప్రాన్): విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని పెద్దశివునూర్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అన్నం యాదగిరి(55) పొలం వద్ద గడ్డి కోసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో గడ్డి కోస్తున్న యాదగిరి కొడవలికి విద్యుత్ వైరు తగలడంతో షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి..
కొండపాక(గజ్వేల్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. కుకునూరుపల్లి ఎస్సై బాలక్రిష్ణ వివరాల ప్రకారం.. కుకునూరుపల్లికి చెందిన ఎండీ మసూద్ అలీ(40) పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై జగదేవ్‌పూర్ మండలంలోని తిమ్మాపూర్‌కు శనివారం వెళ్లాడు. తిరిగి సాయంత్రం వస్తుండగా రాయవరం శివారులో డీసీఎం అతి వేగంగా వచ్చి ద్విచక్ర వాహనంను వెనకనుంచి ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన అతడ్ని అంబులెన్సులో గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు డీసీఎం డ్రైవరు యాదగిరిపై కేసు నమోదు చేశారు.


