సిద్దిపేట జిల్లాలో 2 లక్షల ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు నిబంధనలు పాటించాలి: పోలీసులు
‘‘జిల్లా కేంద్రం సిద్దిపేట పట్టణంలో గత నెల 18న ట్రాఫిక్ పోలీసులు సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. సిబ్బంది బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించి మద్యం తాగినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసి అతడిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి జరిమానాతో పాటు రెండు రోజుల జైలు శిక్ష విధించారు.’’
‘‘సిద్దిపేట పట్టణంలో పది రోజుల క్రితం ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాహనాల తనిఖీ నిర్వహించారు. ఇద్దరు లారీ డ్రైవర్లు మద్యం తాగి వాహనాన్ని నడుపుతూ పట్టుబడ్డారు. వారిని కోర్టులో హాజరుపర్చగా విచారణ జరిపిన న్యాయమూర్తి లారీ డ్రైవర్లకు రెండు రోజుల జైలుశిక్షతోపాటు, రూ.10 వేల జరిమానా విధించారు.’’
సిద్దిపేటకమాన్: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై జిల్లా వ్యాప్తంగా పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు నిర్వహించిన ప్రత్యేక వాహన తనిఖీల్లో 2,12,451 ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు నమోదు చేశారు. మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే కోర్టు రూ.10వేలు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.5వేల జరిమానా విధిస్తుంది.
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం..
సిద్దిపేట పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా వాహనదారులు, హెల్మెట్ ధరించకపోవడం, మద్యం తాగి వాహనం నడపడం, అతివేగం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్, వాహనాలకు నంబర్ ఫ్లేట్ లేకపోవడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, రాష్, రాంగ్ రూట్, మైనర్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ.10వేల జరిమానా, జైలు శిక్ష, మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వాహనదారులతో పాటు వారి తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించి, అవగాహన కల్పిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచడమే తమ ప్రధాన ఉద్దేశమని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు.
ఈ ఏడాది 2 లక్షల కేసులు
జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ 30 వరకు మొత్తం 2,12,451 ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన 9వేల మంది వాహనదారులకు జరిమానా విధించారు. అలాగే ఇప్పటి వరకు 15,636 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 237మందికి కోర్టు జైలు శిక్ష విధించగా, మిగిలిన వారికి రూ.2.80కోట్ల జరిమానా విధించింది. అలాగే మైనర్ డ్రైవింగ్ 1,100 , సెల్‌ఫోన్ డ్రైవింగ్ 1,500, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడంతో 900 కేసులు నమోదయ్యాయి.
డ్రంకెన్ డ్రైవ్‌లో 15 వేల మంది పట్టివేత


