ఎనిమిది మంది అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

ఎనిమిది మంది అదృశ్యం

Jun 4 2026 7:27 AM | Updated on Jun 4 2026 7:27 AM

వేర్వేరు చోట్ల ఘటనలు

ఉమ్మడి జిల్లాలో ఎనిమిది మంది అదృశ్యమయ్యారు. జహీరాబాద్‌ పరిధిలోని అల్లీపూర్‌కు చెందిన విద్యార్థిని, పట్టణంలోని శాంతినగర్‌ కాలనీకి చెందిన యువతి, రాంనగర్‌కు చెందిన వివాహిత, హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన యువకుడు, పటాన్‌చెరులో ఇద్దరు, మిరుదొడ్డి మండలంలో ఒకరు కనిపించకుండా పోయారు. వివరాలు ఇలా...

కంప్యూటర్‌ క్లాసుకు వెళ్లిన విద్యార్థి..

జహీరాబాద్‌ టౌన్‌: విద్యార్థిని అదృశ్యమైన ఘటన జహీరాబాద్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. టౌన్‌ ఎస్‌ఐ.లవకుమార్‌ కథనం ప్రకారం... అల్లీపూర్‌కు చెందిన వసీహ బేగం(21) పట్టణంలోని ఓ కళాశాలలో చదువుతుంది. ఈ నెల 1న మధ్యాహ్నం కంప్యూటర్‌ క్లాసుకు అని చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. చీకటిపడినా తిరిగి రాకపోవడంతో ఆమె తల్లి కంప్యూటర్‌ నిర్వాహకుల వద్దకు వెళ్లి అడగగా రాలేదన్నారు. బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు.

శాంతినగర్‌లో యువతి..

పట్టణంలోని శాంతినగర్‌ కాలనీకి చెందిన రాథోడ్‌ పల్లవి(18) ఈ నెల 1న రాత్రి రోజూ మాదిరిగా అందరితో పాటు కలిసి నిద్రపోయింది. ఆమె తల్లి ఉదయం చూసేసరికి కనిపించలేదు. దీంతో బంధువుల వద్ద అడిగినా ఆచూకీ లభించలేదు.

రాంనగర్‌లో వివాహిత..

పట్టణంలోని రాంనగర్‌కు చెందిన దత్తుతో 15 ఏళ్ల క్రితం పూజారి కల్పన(30) పెళ్లి జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. సంసారం విషయంలో రెండు మూడు రోజుల కింద ఇరువురు గొడవపడ్డారు. ఈనెల 1న భర్త పనులకు వెళ్లగా మధ్యాహ్నం కల్పన ఎవరికీ చెప్పకుండా ఇంటినుంచి వెళ్లిపోయింది. భర్త ఇంటికి వచ్చేసరికి ఆమె కనిపించలేదు. దీంతో బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు.

హౌసింగ్‌ బోర్డులో యువకుడు..

పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన ఎండీ ఖదీర్‌(24) కూలీ పనులు చేస్తున్నాడు. ఈ నెల 1న పనులకు వెళ్లి వచ్చి రాత్రి 11 గంటలకు నిద్రపోయాడు. ఉదయం చూస్తే అతడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అతడి కోసం వెతికినా ఆచూకీ లభించలేదు. తల్లి షాహీన్‌బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

ఇంటి నుంచి బయటకెళ్లి..

మండలంలోని బుర్దిపాడ్‌ గ్రామానికి చెందిన మ్యాతరి సురేందర్‌(41) అదృశ్యమయ్యాడు. గ్రామానికి చెందిన అతడు కూలీ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో మే 28న బైక్‌పై ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అతడి కోసం గాలించారు. బంధువులను అడిగినా ఆచూకీ తెలియకపోవడంతో తండ్రి ఏసప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు.

భార్యతో గొడవపడి..

పటాన్‌చెరు టౌన్‌ : భార్యతో గొడవపడిన భర్త అదృశ్యమైన సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం... ఇస్నాపూర్‌ మున్సిపల్‌ పరిధిలోని శివాలయం సమీపంలో ఉండే వేణు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 2న భార్య కుమారి తనకు తెలియకుండా మీ తల్లిదండ్రులకు డబ్బులు ఎందుకు పంపిస్తున్నారని అడిగింది. ఈ విషయంలో భార్యాభర్తలు ఇద్దరు గొడవపడ్డారు. దీంతో వేణు ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లి తిరిగి రాలేదు. ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్‌ వచ్చింది.

ఇంటి నుంచి వెళ్లిన గృహిణి..

ఇంటి నుంచి బయటకు వెళ్లిన గృహిణి అదృశ్యమైంది. ఇంద్రేశం మున్సిపల్‌ పరిధిలోని పీఎన్‌ఆర్‌ టౌన్‌షిప్‌కు చెందిన లక్ష్మి(29) బుధవారం ఉదయం ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ వచ్చింది. ఆమె కోసం భర్త సిద్దు తెలిసిన వారి వద్ద, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు.

భూంపల్లికి చెందిన మహిళ..

మిరుదొడ్డి(దుబ్బాక): మహిళ అదృశ్యమైన సంఘటన అక్బర్‌పేట–భూంపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ హరీశ్‌ కథనం ప్రకారం.. భూంపల్లి గ్రామానికి చెందిన కుంట రేఖ, స్వామి దంపతులు. వీరికి ఎనిమిది సంవత్సరాలలోపు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కాగా మే 28న రేఖ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన భర్త చుట్టుపక్కల, బంధు మిత్రుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement