కబ్జాలు, మురుగునీటితో ఉనికి కోల్పోతున్న చెరువులు ● ఫిర్యాదులొచ్చినప్పుడే నామమాత్రపు చర్యలు
రామచంద్రాపురం(పటాన్‌చెరు): ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో కళకళలాడిన చెరువులు నేడు మురికి గుంటలుగా మారుతున్నాయి. రామచంద్రాపురం మండల పరిధిలోని ప్రధాన చెరువులు ఉనికిని కోల్పోతున్నాయి. చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నా క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
నామమాత్రపు చర్యలు..
రామచంద్రాపురం, తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని చెరువులపై ఎవరైనా ఫిర్యాదులు చేసినప్పుడు మాత్రమే అధికారులు స్పందించి నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు ఇదే నిర్లక్ష్యంతో వ్యవహరిస్తే రానున్న రోజుల్లో చెరువులు పూర్తిగా మాయమయ్యే ప్రమాదముందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.
నాడు సాగునీరు..
నేడు మురికి గుంటలుగా..
ఒకప్పుడు ఈ చెరువుల కింద వందల ఎకరాల్లో సాగు జరిగేది. పరిసర ప్రాంతాల భూగర్భ జలాలకు ఇవే ప్రధానంగా ఆధారంగా ఉండేవి. వేగంగా విస్తరిస్తున్న అభివృద్ధి కారణంగా ఆక్రమణలు, కాలువలను మూసివేయడంతో చెరువులు రోజురోజుకు కుంచించుకుపోతున్నాయి. చెరువుల ఇన్‌లెట్, ఔట్‌లెట్ కాలువలు కబ్జాలకు గురికావడంతో వర్షాకాలంలో సైతం నీరు చేరని పరిస్థితి నెలకొంది. రామచంద్రాపురం పట్టణంలోని రాయసముద్ర చెరువు, తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని అనేక చెరువుల్లోకి కొన్నేళ్లుగా భారీ ఎత్తున మురుగునీరు చేరుతోంది. దీంతో భూగర్భజలాలు పూర్తిగా కాలుష్యమైపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎఫ్‌టీఎల్ హద్దుల ఏర్పాటేది?
రామచంద్రాపురం మండల పరిధిలోని చెరువులను పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించి ఎఫ్‌టీఎల్ హద్దులను ఏర్పాటు చేయాల్సి ఉండగా దీనిపై అధికారులు ఎందుకు దృష్టి సారించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రానున్న వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకుని చెరువుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలను ప్రారంభించాలని కోరుతున్నారు. మురుగునీరు రాకుండా చేయడంతోపాటు చెరువుల్లోని మురుగునీటిిని తొలగించి స్వచ్ఛమైన నీటిని నింపాలని డిమాండ్ చేస్తున్నారు.
హైడ్రాకు ఫిర్యాదు..
కబ్జాకు గురవుతున్న చెరువులపై ఇప్పటికే పలువురు హైడ్రా అధికారులకు ఫిర్యాదులు చేశారు. పలుమార్లు హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో వచ్చి చెరువులను పరిశీలించి వెళ్లారు తప్ప చర్యలు తీసుకోవడం లేదు.


