జిల్లాలోనే 90శాతం వైద్య సేవలు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలోనే 90శాతం వైద్య సేవలు

May 31 2026 12:04 PM | Updated on May 31 2026 12:04 PM

సంగారెడ్డి జోన్‌: జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లోనే ప్రజలకు 90% వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితులు మినహా రోగులను ఇతర ప్రాంతాలకు రిఫర్‌ చేసే పరిస్థితి రాకుండా వైద్య సేవలను మరింత బలోపేతం చేయాలని మంత్రి స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో శనివారం విద్య, వైద్యం, ధాన్యం కొనుగోళ్లు, సీఎస్‌ఆర్‌ నిధుల వినియోగంతోపాటు అభివృద్ధి పనులపై వేర్వేరుగా అధికారులతో మంత్రి దామోదర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను సమర్థవంతంగా వినియోగించి, ప్రతీ రోగికి సకాలంలో మెరుగైన చికిత్స అందించడం వైద్య సిబ్బంది బాధ్యతన్నారు. కంకోల్‌, సింగితం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాలు, సంగారెడ్డి నర్సింగ్‌ కళాశాల నిర్మాణ పనులు పూర్తయిన నేపథ్యంలో వాటిని ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌) నిధులను ప్రజల అవసరాలకు అనుగుణంగా, పారదర్శకంగా వినియోగించాలన్నారు. విద్య, వైద్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, మహిళా సాధికారత, నైపుణ్యాభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, వైద్య సంస్థల మౌలిక సదుపాయాల అభివృద్ధికి సీఎస్‌ఆర్‌ నిధులను ప్రాధాన్యతతో కేటాయించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడంతో అవసరమైన మరమ్మతులు చేపట్టాలన్నారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, సబ్‌ కలెక్టర్‌ ఉమాహారతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మంత్రి దామోదర రాజనర్సింహ

అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష

Advertisement
 
Advertisement
Advertisement