సంగారెడ్డి: తాజా బదిలీపై వెళ్లిన మాజీ డీఎంహెచ్‌ఓ వసంతరావుపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది నవంబర్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి మృతిచెందగా సదరు కుటుంబ సభ్యులు వైద్యుల వైఖరిపై ఆందోళన చేశారు. ఈ వ్యవహారంలో డీఎంహెచ్‌ఓ మధ్యవర్తిత్వం వహించి ఆస్పత్రి యాజమాన్యం నుంచి రూ.25లక్షలకు నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పారు. ఆస్పత్రి యాజమాన్యం బాధిత కుటుంబసభ్యులకు తొలివిడతగా రూ.15లక్షలు ఇవ్వగా మిగతా రూ.10లక్షలను డీఎంహెచ్‌ఓకు ఇచ్చేశారు. అయితే బాధిత కుటుంబానికి అందాల్సిన నష్టపరిహారాన్ని డీఎంహెచ్‌ఓ వసంతరావు తన సొంతానికి వాడేసుకున్నారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు డీఎంహెచ్‌ఓను నిలదీయగా ఈ రోజు రేపు అంటూ వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. శనివారం వసంతరావు బదిలీ అవుతున్నట్లు తెలుసుకున్న బాధిత కుటుంబసభ్యులు నేరుగా ఆయన కార్యాలయానికి వెళ్లి నష్టపరిహారం డబ్బులు ఇవ్వాలని గొడవ చేశారు. దీంతో వారికి రూ.5లక్షలే ఇచ్చి మిగతా రూ.5లక్షలు తర్వాత ఇస్తానని చెప్పి వెళ్లిపోయారు. డీఎంహెచ్‌ఓ పనితీరు సరిగా లేకపోవడంతో కలెక్టర్ పలుమార్లు నోటీసులు కూడా అందజేసినట్లు తెలుస్తోంది. అయినా ఆయన వ్యవహారశైలిలో మార్పు రాకపోవడంతో బదిలీ చేసినట్లు సమాచారం.


