వెల్దుర్తి(తూప్రాన్): వృద్ధురాలిని బెదిరించి దుండగులు బంగారు కమ్మలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మండలంలో కలకలం రేపింది. వివరాలు ఇలా... మండలంలోని రామాయిపల్లి గ్రామానికి చెందిన రాపర్తి రాజమ్మ పింఛన్ డబ్బులు డ్రా చేసుకునేందుకు మండలంలోని సెంట్రల్ బ్యాంక్‌కు వచ్చింది. సోమవారం డబ్బులు తీసుకోవాలని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో ఆరెగూడెం గ్రామంలో ఉండే బంధువుల ఇంటికి వెళ్లడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో బ్యాంకు బయటే ఉన్న ఓ ఆటో డ్రైవర్ తాను అదే రూట్లో వెళుతున్నానని, ఆరెగూడెం వద్ద దిగబెడతానంటూ నమ్మించి ఆటోలో ఎక్కించుకున్నాడు. కానీ ఆరెగూడెం గేట్ దాటి బస్వాపూర్ గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మెడపై కత్తి పెట్టి చెవులకు ఉన్న బంగారు కమ్మలను ఆటోడ్రైవర్‌తో పాటు అందులో ఉన్న మరో వ్యక్తి బలవంతంగా లాక్కున్నారు. ఈ క్రమంలో వృద్ధురాలి దవడ, రెండు చెవులకు గాయాలయ్యాయి. అనంతరం మహిళను ఆటోనుంచి బయటకు గెంటివేసిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. వృద్ధురాలి ఏడుపులు విని చుట్టుపక్కల వారు విషయాన్ని కుటుంబసభ్యులకు చేరవేసి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


