జీలుగ సాగు.. ఫలితాలు బాగు | - | Sakshi
Sakshi News home page

జీలుగ సాగు.. ఫలితాలు బాగు

May 31 2026 12:04 PM | Updated on May 31 2026 12:04 PM

మరికొన్ని అందుబాటులో..

50 శాతం సబ్సిడీపై అందజేత

రైతులు సద్వినియోగం చేసుకోవాలి:

అధికారులు

ఇప్పటికే జిల్లాలో విత్తనాల పంపిణీ

చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): అధిక మొత్తంలో రసాయన ఎరువులు వినియోగించడం మూలంగా నేల భూసారాన్ని కోల్పోవడంతో పాటు, ప్రకృతికి సైతం హాని జరుగుతుంది. దీనిని అరికట్టేందుకు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 50 శాతం సబ్సిడీపై రైతులకు జీలుగ, జనుము విత్తనాలను అందజేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 3,285 క్వింటాళ్ల జీలుగ, 1030 క్వింటాళ్ల జనుము విత్తనాలను అధికారులు పంపిణీ చేశారు. కాగా ఇవి రెండు కలిపి మరో 715, 180 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జీలుగ 30 కేజీల బస్తా ధర రూ.2452 ఉండగా ఎకరాకు 12 నుంచి 16 కిలోలు, జనుము 40 కేజీల బస్తా ధర రూ.3110 ఉండగ.. ఎకరాకు 16 నుంచి 20 కిలోల వరకు చల్లుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

జీలుగతో భూసారం పెరుగుదల

జీలుగ సాగుతో భూసారం పెరుగుతుంది. 35 నుంచి 45 రోజుల వరకు పెరిగిన జీలుగ మొక్కలను నేలలోనే కలియదున్నితే సుమారు 12 టన్నుల జీవపదార్థం నేలలో చేరుతుంది. దీంతో సేంద్రియ కర్బనం పెరిగి భూమి సారవంతమవడంతో పాటు, సూక్ష్మజీవుల పెంపకం, తెగుళ్ల నివారణ, నీటి నిల్వ సామర్థ్యం పెరగుతుంది. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, పంట దిగుబడిని కొంతవరకు పెంచుతుంది.

జనుము ప్రయోజనాలు

పర్యావరణ అభివృద్ధికి జనుము కీలక పంట అని, పూత దశకు వచ్చిన తర్వాత నేలలో కలియదున్నడం మూలంగా పచ్చిరొట్ట ఎరువుగా మారుతుంది. కాగా పంట ఏపుగా పెరగడంతో కలుపు మొక్కలను సైతం అణిచి వేస్తుంది. తర్వాత వేరే పంట సాగు చేస్తే కలుపు నివారణ సులభం అవుతుంది. ఈ పంట పశుగ్రాసానికి సైతం వినియోగించుకోవచ్చు. సాగు వల్ల రసాయన ఎరువుల వినియోగం తగ్గి, భూసారంతో పాటు పంట దిగుబడి సైతం పెరుగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement