కొండాపూర్(సంగారెడ్డి): దివ్యాంగులు స్వయం ఉపాధి రంగంలో రాణించాలని డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ప్రోగ్రాం మేనేజర్ ఆనంద్ నాయక్ అన్నారు. శనివారం డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్, సెర్ప్ సంస్థ సహకారంతో దివ్యాంగులకు కొండాపూర్‌లోని మహిళా సమాఖ్య కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు స్వయం ఉపాధి అవకాశాలు, వ్యాపార నిర్వహణ, ఆర్థిక ప్రణాళిక, మార్కెటింగ్ పద్ధతులు, చిన్న వ్యాపారాల అభివృద్ధిపై అవగాహన కల్పించారు. అనంతరం ఆనంద్ నాయక్ మాట్లాడుతూ.. డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ దివ్యాంగుల సంక్షేమమానికి నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ శిక్షణ ద్వారా దివ్యాంగులు తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు, స్వయం ఉపాధి అవకాశాలపై కూడా వారికి అవగాహన కల్పించారు. అనంతరం ఏపీఎం మాణిక్యంతో కలిసి దివ్యాంగులకు గ్రాంట్ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ గ్రాంట్లు వారి స్వయం ఉపాధి వ్యాపారాల ప్రారంభానికి ఎంతో ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ జిల్లా క్లస్టర్ మేనేజర్ రవిప్రకాశ్ , క్లస్టర్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ , మండల సమాఖ్య క్లస్టర్ కోఆర్డినేటర్‌లు తదితరులు పాల్గొన్నారు.


