● కలెక్టర్ ప్రతిమా సింగ్ ● సభాపతులుగా, మంత్రులుగా మారిన విద్యార్థినులు
మెదక్ కలెక్టరేట్: విద్యార్థుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా మాక్ పార్లమెంట్ నిర్వహించామని కలెక్టర్ ప్రతిమాసింగ్ పేర్కొన్నారు. శనివారం జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో డీఆర్డీఏ, స్నేహ సంఘాల సభ్యులతో మాక్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించారు. 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాలల హక్కులు, బాలికల భద్రత, విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత, సామాజిక సమస్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పలు మండలాల నుంచి ఎంపికై న బాలికలు సభాపతి, మంత్రులు, ప్రతిపక్ష సభ్యులు, ప్రజా ప్రతినిధుల పాత్రలను పోషిస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరును ప్రత్యక్షంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మాక్ పార్లమెంట్ ద్వారా విద్యార్థుల్లో వక్తృత్వ నైపుణ్యాలు, నాయకత్వ సామర్థ్యాలు, సమస్యలను విశ్లేషించే దృక్పథం, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంపొందుతుందని తెలిపారు. బాలికల రక్షణ, సంరక్షణ కింద బాల్య వివాహల నిర్మూలనకు 1098, ఇంట్లో ఏమైనా సమస్య తలెత్తితే సఖీ సహాయ కేంద్రం 181, డయల్ 100కు కాల్ చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, డీఎస్పీ ప్రసన్నకుమార్, డీడబ్ల్యూఓ హేమాభార్గవి , అదనపు డీఆర్డీఓ సరస్వతి, ఆయా శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కిశోర బాలికలు పాల్గొన్నారు.


