కొనుగోలు కేంద్రాల్లో నిలువ ఉంచిన ధాన్యం ఇటీవల కురిసిన వర్షాలకు తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో ప్రతీ ఏటా ప్రతీ చోటా ఇవే దృశ్యాలు పునరావృతమవుతున్నా ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం ప్రణాళిక లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తూకం వేసిన ధాన్యాన్ని వెనువెంటనే రైస్ మిల్లులకు తరలించడంలో అధికారుల నిర్లక్ష్యమే కారణమని రైతులు రోడ్లెక్కి ఆందోళన చెందుతున్నారు.
–జిన్నారం (పటాన్‌చెరు)
జిన్నారం గుమ్మడిదల మండలాల్లో ఐకేపీ పీఏసీఎస్ సెంటర్లలో నిలువ ఉంచిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు రవాణా చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో మంగళవారం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి పెద్ద ఎత్తున ధాన్యం నీట మునిగింది. ఆరుగాలం రైతులు చెమటోర్చి పండించిన ధాన్యం హమాలీలు, రవాణా సౌకర్యం లోపంతో తడిసి ముద్దయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రాలను
సందర్శించిన ఎమ్మెల్యే
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి జిన్నారం మండలంలోని కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యానికి సంబంధించిన వివరాలు రైతులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాలకు 15 రోజుల క్రితమే ధాన్యం చేరుకున్నా రైస్ మిల్లులకు తరలింపులో నిర్లక్ష్యం వహించడమే ప్రధాన కారణమని తెలిపారు. కనీసం టార్పాలిన్ సంచులు కూడా తామే సమకూర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో పూర్తి వైఫల్యం చెందిందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని జిల్లా పౌరసరఫరాల అధికారులను ఆదేశించారు.
రోడ్డెక్కిన రైతన్నలు...
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతన్నలు రోడ్డెక్కారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దవ్వడంతో బుధవారం గుమ్మడిదల జాతీయ రహదారిపై రైతులు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. రైతులకు స్థానిక బీఆర్‌ఎస్ నేతలు మద్దతిస్తూ రాస్తారోకో చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఒక్క రైస్‌మిల్లు వల్లే జాప్యం
ఉమ్మడి జిన్నారం మండలానికి సంబంధించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని స్వీకరించేందుకు ఒకే రైస్ మిల్లు ఉంది. ఉన్న ఒక్క మిల్లుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ధాన్యం తీసుకోవడంతో స్థానిక రైతుల ధాన్యాన్ని తీసుకోవడం నిలిపివేశారు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. –ఆంజనేయులు, రైతు
సకాలంలో తరలించకపోవడంతో..
రోజుల తరబడి ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించారు. సమయానికి తూకం వేసిన ధాన్యాన్ని సకాలంలో తరలించకపోవడంతో చేతికందిన పంట నీటిపాలైంది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి.
–లక్ష్మీనారాయణ, రైతు
తడిసిన ధాన్యం.. కొనుగోలు చేయాలని రైతుల ధర్నా
వెంటాడిన రవాణా లేమి, హమాలీల కొరత,
అధికారుల నిర్లక్ష్యంతోనే పంట నీటపాలు


