‘రెవెన్యూ’లో తరచూ వెలుగులోకి అధికారుల భూ బాగోతాలు హెచ్‌ఎండీఏ, ముంబై హైవే మండలాల్లోనే కొందరు తహసీల్దార్లు బదిలీ అయినా అవే మండలాల్లో పోస్టింగ్‌లు ఈ శాఖను గాడిలో పెట్టాలనే అభిప్రాయం నూతన కలెక్టర్ ప్రతీక్ జైన్ బాధ్యతల స్వీకరణ నేపథ్యంలో...
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా నూతన కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు తన సొంత రెవెన్యూ శాఖనే సవాల్‌గా మారనుంది. ఈ శాఖలో జిల్లాలో పాతుకుపోయిన కొందరు అధికారుల అవినీతి, అక్రమాల బాగోతాలు తరచూ వెలుగులో వస్తుండటంతో ఆశాఖ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతానికి పరోక్షంగా సహకరిస్తూ రూ.కోట్లు దండుకుంటున్నారనే ఆరోపణలు కొందరు అధికారులు ఎదుర్కొంటుండగా, వివాదాల్లో ఉన్న ప్రైవేటు భూముల లావాదేవీల విషయంలో పెద్ద మొత్తంలో ముడుపులు పుచ్చుకుంటున్న ఘటనలు జిల్లాలో సంచలనంగా మారుతున్నాయి. ప్రతీక్‌జైన్ సోమవారమే కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో ఈ యువ ఉన్నతాధికారికి ఇప్పుడు రెవెన్యూశాఖను గాడిపెట్టడం సవాల్‌గా మారనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆ మండలాల్లోనే ఏళ్ల తరబడి..
జిల్లాలో కొందరు తహసీల్దర్లు రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములున్న, రియల్ ఎస్టేట్ వెంచర్లు, భారీ రియల్ ప్రాజెక్టులున్న మండలాల్లో పాతుకు పోయారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని మండలాలు, ముంబై హైవే ఉన్న మండలాల్లోనే వీరు పోస్టింగ్‌లు దక్కించుకుంటున్నారు. ఎన్నికలు వంటి కారణాలతో బదిలీ అయినా..కొన్ని నెలలు కూడా గడవకుండానే వీరు తిరిగి పక్క మండలానిని చేరుకుని తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గత బీఆర్‌ఎస్ సర్కారులో కీలక మండలాల్లో పనిచేసిన తహసీల్దార్లు ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు హయాంలోనే కీలక మండలాల్లో పోస్టింగ్‌లు దక్కించుకుంటూ తమ హవాను కొనసాగిస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది. హైదరాబాద్‌కు అనుకుని ఉన్న ఈ మండలాల్లో భూముల ధరలు రూ.కోట్లలో పలుకుతున్నాయి. దీంతో వీరి అక్రమార్జన కూడా అదేస్థాయిలో ఉంటోందనే ఆరోపణలున్నాయి. ఇలాంటి అక్రమార్కులకు కలెక్టర్ చెక్ పెడతారా? లేదా అనే అంశం తెరపైకి వస్తోంది.
సంచలనంగా మారుతున్న భూ బాగోతాలు
రెవెన్యూ అధికారుల అక్రమాలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఇటీవల నందికందిలో 9.13 వివాదాస్పద భూమికి నకిలీ ధ్రువీకరణపత్రాలు సృష్టించి వ్యక్తికి పౌతీ చేసిన వ్యవహారంలో రూ.కోట్లలో ముడుపులు చేతులు మారాయి. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో తహసీల్దార్‌పై బదిలీ వేటు పడగా, డిప్యూటీ తహసీల్దార్, ఇతర అధికారులను సస్పెండ్ చేశారు. రామచంద్రాపురం మండలంలో పనిచేసిన ఓ తహసీల్దార్‌పైనా బదిలీవేటు పడింది. రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేయడంలో కీలకంగా వ్యవహరించినందుకు ఆయన్ను మారుమూల మండలానికి బదిలీ చేశారు. జిల్లాలో పటాన్‌చెరు నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం చేయడంలో కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలపై ఓ ఆర్డీఓపై కూడా ఆకస్మిక బదిలీ వేటు పడింది. ఇలా రెవెన్యూలో అక్రమార్కుల ముడుపుల బాగోతాలు తరచూ వెలుగులోకి వస్తుండటం సంచలనంగా మారుతోంది.
అన్యాక్రాంతమైన సర్కారు భూములు
జిల్లాలో రూ.కోట్లు విలువ చేసే సర్కారు భూములు అన్యాక్రాంతమయ్యాయి. అమీన్‌పూర్ మండలంలో రూ.లక్షల కోట్ల విలువైన వందల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయి. ప్రజాప్రతినిధులు, బడాబాబులు చేస్తున్న సర్కారు భూముల కబ్జాకు కొందరు రెవెన్యూ అధికారులు సహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కబ్జా జరుగుతున్నా కళ్లు మూసుకున్నందుకు కాసుల వర్షం కురుస్తోంది. తీరా అన్యాక్రాంతమయ్యాక చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని అక్రమాన్ని సక్రమం చేయడంలోనూ కొందరు అధికారులు ఆరితేరిపోయారు. వీరిపై కొత్త కలెక్టర్ దృష్టి సారిస్తే ఈ శాఖ కొంతమేరకు గాడిన పడుతుందనే వాదన వినిపిస్తోంది.
భూ భారతి సమస్యలే అధికం
ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణిలో భూసమస్యలే అధికంగా ఉంటున్నాయి. అయితే ఈ సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో పనిచేసే రెవెన్యూ అధికారులు, సిబ్బంది పట్టించుకోకపోవడంతో బాధితులు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. ముడుపులు ఇచ్చే బడాబాబులు, నేతలు, ప్రజాప్రతినిధుల భూసమస్యలు ఆగ మేఘాలపై పరిష్కారం అవుతుండగా, నిరుపేద రైతులు మాత్రం చెప్పులరిగేలా ప్రజావాణికి క్యూ కడుతున్నారు. ఇలాంటి నిరుపేద రైతుల భూసమస్యల పరిష్కారంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారిస్తే ప్రజల మన్ననలు పొందుతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


