సాక్షి, సిటీబ్యూరో: ఇటీవల ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఐలాపూర్ గ్రామ భూముల పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. ఈ భూములపై తదుపరి చర్యలకు సంబంధించి విధివిధానాలు రూపొందించే బాధ్యతను కూడా ఈ కమిటీకి ప్రభుత్వం అప్పజెప్పింది. రెవె న్యూ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
సీసీఎల్‌ఏ కమిషనర్ చైర్మన్‌గా..
చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్స్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్‌ఏ) ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. రెవెన్యూ శాఖ కార్యదర్శి, హెచ్‌ఎండీఏ కమిషనర్, సర్వే, సెటిల్‌మెంట్ కమిషనర్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ కార్యదర్శి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ సభ్యులుగా ఉంటారు. ఆ భూమి స్వభావం ఏంటి? ఎంత విస్తీర్ణంలో ఉన్నాయనే అంశాలతో పాటు భూమికి చెందిన రికార్డులను పరిశీలిస్తారు. నిజాం కాలంలో సర్ఫ్–ఎ–ఖాస్, దివాణి భూములుగా వీటిని నిర్ణయించడానికి ఉన్న మూలాలు ఏంటి? ఆ భూములకు ఉన్న చట్టబద్ధత ఏంటి? రెవెన్యూ రికార్డుల్లో ఉన్న హక్కుల నమోదు వివరాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. సర్వే, సెటిల్‌మెంట్‌కు సంబంధించిన సమస్యలను, ఇప్పటివరకు జరిగిన ఆక్రమణలపై సమగ్రంగా ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. సర్ఫ్–ఎ–ఖాస్ భూములు సమకూరిన తీరు, హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు ఏం చెబుతున్నాయి. కోర్టుల్లో పెండింగ్ ఉన్న కేసులేంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితులను పరిశీలిస్తుంది. ఈ భూముల రక్షణకు అవసరమైన చర్యలను సూచిస్తుంది.
ఇదీ జరిగింది..
సంగారెడ్డి జిల్లా ఐలాపూర్ గ్రామంలోని సర్ఫ్–ఎ–ఖాస్ భూముల ఆక్రమణలపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ, మున్సిపల్ శాఖలతో కలిసి హైడ్రా ఈ భూములను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. మొత్తం 1,263 ఎకరాలకుగాను 861 ఎకరాలకు హైడ్రా కంచె వేసింది. 1998లో, 2013లో హైకోర్టు స్టే విధించినప్పటికీ ముఖీం అనే వ్యక్తి అక్కడ అతిథిగృహాన్ని విలాసవంతంగా నిర్మించుకుని..40 ఎకరాల మేర ఆక్రమించి ఫామ్‌హౌస్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. అతిథి గృహాన్ని తొలగించి ఫామ్‌హౌస్ ఆక్రమణలను హైడ్రా క్లియర్ చేసింది. పక్కనే ఉన్న కిష్టారెడ్డిపేటలోని భూమి వివరాలిచ్చి ఐలాపూర్‌లోని ప్రభుత్వ భూమిలో ముఖీం తమ్ముడు అజీం నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని కూడా హైడ్రా తొలగించింది.
సర్ఫ్–ఎ–ఖాస్ భూముల
లెక్క తేల్చే పనిలో ప్రభుత్వం


