నష్టపరిహారం ప్రకటించండి | - | Sakshi
Sakshi News home page

నష్టపరిహారం ప్రకటించండి

Apr 18 2026 8:17 AM | Updated on Apr 18 2026 8:17 AM

నష్టపరిహారం ప్రకటించండి

సంగారెడ్డి: అందోల్‌, సంగారెడ్డి ప్రాంత రైతులకు క్రాప్‌ హాలిడే నష్టపరిహారం ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌ డిమాండ్‌ చేశారు. ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన పలు కీలక సమస్యలపై ఎమ్మెల్యే చింతప్రభాకర్‌, చంటి క్రాంతికిరణ్‌లు కలెక్టర్‌ ప్రావీణ్యను శుక్రవారం కలసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ మాట్లాడుతూ...సింగూర్‌ ప్రాజెక్టు నుంచి నీటి అసమాన పంపిణీ కారణంగా అందోల్‌ ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రెండేళ్లుగా ఎడమ కాలువ ద్వారా చుక్క నీరు కూడా విడుదల కాలేదని, మరోవైపు దిగువన ఘనాపూర్‌ ఆయకట్టు ప్రాంతాలకు మాత్రం నీరు అందుతోందని తెలిపారు. సింగూర్‌ డ్యామ్‌లో తగినంత నీరు ఉన్నప్పటికీ ‘‘మరమ్మతు పనులు’’పేరుతో ఆలస్యం జరుగుతోందని విమర్శించారు. దీంతో పుల్కల్‌, అందోల్‌ మండలాల్లోని విస్తారమైన సాగుభూములు నీటి లేమితో నిర్జీవంగా మారుతున్నాయని పేర్కొన్నారు. రెండు యాసంగి సీజన్లలో రైతులు పంటలు వేయకుండా భూములను పాడుబడినట్టే ఉంచాల్సి వచ్చిందని తెలిపారు. ఇటీవల డ్యామ్‌ నీరు ముందస్తు సమాచారం లేకుండా విడుదల చేయడంతో పోచారం, ముద్దాయిపేట్‌, పుల్కల్‌, గంగోజిపేట్‌ గ్రామాల్లో వరదలు వచ్చి వందల ఎకరాల పంటలు మునిగిపోయాయని చెప్పారు. అయినప్పటికీ బాధిత రైతులకు ఇప్పటివరకు పరిహారం అందలేదని వివరించారు.

ప్లాంట్‌ ఏర్పాటు చేయండిః చింత ప్రభాకర్‌

సంగారెడ్డి నియోజకవర్గ సమస్యలను ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. గిర్మాపూర్‌ సాంఘిక సంక్షేమశాఖ హాస్టల్‌లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, దాని పరిష్కారానికి వెంటనే ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని కోరారు. వెంటనే స్పందించిన కలెక్టర్‌ ఆర్‌ఓ ప్లాంట్‌ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారన్నారు. నియోజకవర్గంలో కొనసాగుతున్న పెండింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు జైపాల్‌రెడ్డి, మాజీ సీడీసీ చైర్మన్‌ కాసాల బుచ్చిరెడ్డి, విజయ్‌, కనకారెడ్డి తదితరులు ఉన్నారు.

కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే

Advertisement
 
Advertisement
Advertisement