న్యాల్‌కల్(జహీరాబాద్): ప్రాణాపాయస్థితిలో ఉన్న జింక పిల్లను కాపాడి అటవీ అధికారులకు అప్పగించిన ఘటన మండల పరిధిలోని రాఘవాపూర్ గ్రామ శివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే...రాఘవాపూర్ గ్రామ శివారులోని మిషన్ భగీరథ ఫిల్టర్ వద్ద రోజులాగే కార్మికులు పని చేస్తున్నారు. రాత్రి వేళ ఓ కుక్క జింక పిల్లను నోట కరుచుకుని ఫిల్టర్ బెడ్‌లోకి వచ్చింది. ఇది గుర్తించిన కార్మికులు హుస్సేన్, శ్రీపాల్‌రెడ్డి, రాములు, సురేష్ తదితరులు కుక్కను తరమడంతో జింక పిల్లను వదిలేసి పారిపోయింది. అనంతరం వారు దానికి నీటిని తాగించి ప్రాణాపాయస్థితి నుంచి కాపాడి అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. వెంటనే వారు అక్కడకు చేరుకోగా జింకపిల్లను అప్పగించారు. జింక పిల్లను కాపాడిన వారిని అటవీ అధికారి వనజ అభినందించారు. గాయ పడిన జింక పిల్లకు వైద్యం అందిస్తున్నామని వనజ తెలిపారు.


