ఎట్టకేలకు చేనేత పోరు | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు చేనేత పోరు

Apr 9 2026 9:23 AM | Updated on Apr 9 2026 9:23 AM

జోగిపేట(అందోల్‌): ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం చేనేత సహకార సంఘం ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమవుతోంది. దాదాపు పుష్కరకాలం తర్వాత చేనేత, జౌళిశాఖ పరిధిలోని సహకార సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 4 నుంచి మే 15 వరకు సహకార సంఘాల సభ్యుల ఓటరు జాబితా తయారు చేయాలని మార్చి 24న షెడ్యూల్‌ ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అధికారులు ఓటరు జాబితా తయారీలో నిమగ్నమయ్యారు. సంఘంలో సభ్యత్వం కలిగి ఉండి మరణించిన వారు, డిఫాల్టర్‌ (సంఘంలో నగదు, వస్తు రూపంలో 90 రోజుల కంటే ఎక్కువ బకాయిలు ఉన్నవారు) పేర్లను అధికారులు తొలగించనున్నారు.

జిల్లా వ్యాప్తంగా 10 సంఘాలు

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 10 చేనేత, ఉన్ని, పవర్‌లూమ్స్‌ సంఘాలున్నాయి. ఈ సంఘాల్లో దాదాపు మూడు వేల మంది సభ్యులున్నారు. జోగిపేట, జహీరాబాద్‌,నారాయణఖేడ్‌, హన్మంతరావుపేట, సదాశివపేటలలో చేనేత, జోగిపేట, కందిలో ఉన్ని సంఘాలున్నాయి. ఇక పవర్‌లూమ్స్‌ సంఘాలు సదాశివపేటలోనే మూడున్నాయి. ఈ సంఘాలకు గత ఎన్నికలు 2013 ఫిబ్రవరి 12న నిర్వహించారు. 2018 ఫిబ్రవరి 10 నాటికి చేనేత సంఘాల పాలకవర్గం గడువు పూర్తయ్యింది. అప్పట్నుంచీ ఇప్పటివరకు పాలకవర్గాన్ని ఆర్నెల్లకొకసారి పొడిగిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పాలక వర్గాలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

బకాయిలు చెల్లిస్తే అర్హులే

వివిధ కారణాల చేత 90 రోజులు బకాయిలున్న కార్మికులను ఎన్నికలకు అనర్హులుగా ప్రకటిస్తారు. ఎన్నికల తేదీ ప్రకటించే నాటికి పూర్తిస్థాయి బకాయిలు చెల్లిస్తే వారు తిరిగి అర్హత పొందినట్లే. ఓటరు జాబితా తయారీ విషయంలో ప్రస్తుతం పనులు చురుగ్గా సాగుతున్నాయి. జిల్లాలో హెచ్‌డబ్ల్యూఎస్‌లు ఏడు, పవర్‌ లూమ్స్‌ 3 ఉన్నాయి. ఈనెల 15వ తేదీలోగా ఓటర్ల జాబితాను పంపాలి. – సి.లలిత చేనేత,

జౌళీశాఖ డెవలప్‌మెంట్‌ అధికారి

జిల్లాలో 10 చేనేత సహకార సంఘాలు

ఓటర్ల జాబితా తయారీలో

అధికారులు నిమగ్నం

వచ్చేనెల 15నాటికి తుది జాబితా

ఓటరు జాబితా కార్యక్రమాలు

ఏప్రిల్‌ 4 నుంచి 15 వరకు అధికారులు బకాయిలున్న సంఘ సభ్యుల పేర్లు ప్రకటించి, వారికి బకాయి నోటీసులు జారీ చేయనున్నారు. ఏప్రిల్‌ 15 నుంచి 17 వరకు ఓటరు జాబితా తయారు చేస్తారు. 18 నుంచి 25వ తేదీ వరకు తుది జాబితా అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. 27 నుంచి 29 వరకు అభ్యంతరాల పరిశీలన, జాబితా సవరణ జరగనుంది. ఏప్రిల్‌ 30 నుంచి మే 1వరకు జాబితాను పైఅధికారులకు అందజేయనున్నారు. మే 2 నుంచి 15 వరకు అధికారుల పరిశీలన, ప్రచురణ, ఎన్నికలకు ప్రతిపాదించే అవకాశం కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement